” ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేందుకు ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి వీలుగా 4 లక్షల మందిని నెలకు రూ.5000 జీతంతో వాలంటీర్లుగా నియమిస్తాం. గ్రామ సచివాలయాల్లో అక్టోబరు రెండో తేదీ నాటికి 10 మంది చొప్పున అన్ని వర్గాలతో కూడిన మరో 1,60,000 మంది గ్రామ కార్యదర్శులను నియమిస్తాం..”
ముఖ్యమంత్రిగా.. జగన్మోహన్ రెడ్డి .. ప్రమాణం చేసిన సమయంలోని ప్రసంగపాఠంలో వాలంటీర్ల గురించి చెప్పిన మాట ఇది. వాలంటీర్లుగా నాలుగు లక్షల మందిని ఆగస్టు పదిహేనో తేదీ కల్లా.. రూ. ఐదు వేల జీతంలో నియమిస్తామని.. జగన్మోహన్ రెడ్డి… సూటిగా ప్రకటించారు. కానీ ఇప్పుడు… వాలంటీర్ల నియామకాలకు.. నోటిఫికేషన్ వచ్చింది. అయితే.. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు నాలుగు లక్షల వాలంటీర్ పోస్టులకు కాదు.. కేవలం 1,70,543 గ్రామ వలంటీర్ల నియామకానికి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేశారు. పట్టణాల్లో మరో 40 వేల వార్డు వలంటీర్ల నియామకాలకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అంటే మొత్తం పోస్టులు రెండు లక్షలకు అటూ ఇటుగా ఉండనున్నాయి.
ఏపీలో మొత్తం కుటుంబాలు… 1,22,70,164 ఉన్నాయని 2011 సామాజిక ఆర్థిక, కుల గణన తెలిపింది. ఎనిమిదేళ్లలో వీటి సంఖ్య కోటి 70 లక్షలు దాటిపోయి ఉంటుందని అంచనా. వీటిలో గ్రామీణ కుటుంబాల శాతం 76. అంటే.. దాదాపుగా కోటి ఇరవై లక్షల కుటుంబాలకుపైగానే… గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరికీ… లక్షా 70వేల వాలంటీర్ల పోస్టులు సరిపోయే అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లో… మరో ఇరవై నాలుగు శాతం కుటుంబాలు ఉంటాయి కాబట్టి… 40వేల వాలంటీర్లు సరిపోరు. అయినప్పటికీ.. ప్రభుత్వం.. కుదించి నోటిఫికేషన్ విడుదల చేసింది. జగన్ చెప్పిన నాలుగు లక్షల వాలంటీర్లలో… సగానికి సగం తగ్గించడం… మాత్రం అనూహ్యమే.
జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు… ఇప్పుడు.. ప్రభుత్వం… ఇస్తున్న ఉద్యోగాలకు పొంతన లేకపోవడంతో… యువతలో అనుమానాలు మొదలయ్యాయి. నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని.. అందులో… వైసీపీ కార్యకర్తల కోటా ఎంతో కొంత పోయినా.. తమకు కనీస ఉద్యోగం ఉంటుందని.. చాలా మంది యువత ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం రెండులక్షల ఉద్యోగాలకు కోత పెట్టడంతో… వారు నిరాశ చెందుతున్నారు. గ్రామ సచివాలయాల్లో నియమిస్తామంటున్న మరో లక్షా అరవై వేల మందిని అయినా నియమిస్తారో.. అక్కడా కోత విధిస్తారోనని.. యువతలో టెన్షన్ ప్రారంభమయింది.