నలుగురు తెలుగుదేశం ఎంపీలు పార్టీని వదిలేసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే భాజపాలోకి చేరుతారానీ, కొంతమంది తమతో టచ్ లో ఉన్నారంటూ భాజపా నేతలు లీకులిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ తరహా కథనాలు కొన్ని హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, పార్టీకి చెందిన కీలక నేత అంబికా కృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు..! ఆయన కూడా భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రమే కాషాయ కండువా కప్పుకుంటారు. రామ్ మాధవ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ తరఫున కీలక నేతగా అంబికా ఉంటూ వచ్చారు. ఇప్పుడాయన పార్టీ వీడటమంటే ఆ జిల్లాలో పార్టీకి ఎదురుదెబ్బగానే భావించాలి.
1999 నుంచి 2004 వరకూ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు అంబికా కృష్ణ. కమ్యూనిటీపరంగా చూసుకుంటే… వైశ్య సామాజిక వర్గానికి చెందిన పెద్ద నాయకుడిగా పార్టీలో గుర్తింపు పొందారు. 2014లో టీడీపీకి అధికారంలోకి వచ్చాక.. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపడుతూ వస్తున్నారు. అయితే, తాజాగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో… భాజపాలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం సీట్లన్నీ టీడీపీ గెలుచుకుంది. కానీ, తాజా శాసన సభ ఎన్నికల్లో ఏలూరు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు. జిల్లావ్యాప్తంగా ఓటమి పాలైన టీడీపీ సభ్యుల్లో మరికొంతమంది కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగానే విశ్వసనీయంగా తెలుస్తోంది.
అంబికా కృష్ణ పార్టీ వీడుతుండటంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల మూడ్ ఎలా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచినవారు భాజపా వెళ్లడం ఒకెత్తు అయితే, పార్టీలో కీలకంగా ఉన్న నేతలు కూడా దిక్కులు చూస్తున్నారనడానికి ఇదో ఉదాహరణ కాబోతోంది. పార్టీలో కొనసాగితే రాబోయే ఐదేళ్లు కొన్ని ఇబ్బందులు తప్పవేమో అనే ఒక ఆందోళన వ్యక్తమౌతున్నట్టుగా ఉంది. నలుగురు ఎంపీలు జంప్ చేయడంతో నైరాశ్యంలో ఉన్న టీడీపీకి, ఇప్పుడు కీలకనేతల వలసలు మొదలయ్యాయనే సంకేతాలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తోంది.