గీతా గోవిందం లాంటి హిట్టు కొట్టిన తరవాత కూడా దర్శకుడు పరశురామ్‌కి గ్యాప్ వచ్చేసింది. నిజానికి ఈ గ్యాప్ కావాలని తీసుకున్నదే. మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది పరశురామ్ ప్రయత్నం. మహేష్ కూడా పరశురామ్‌తో చేయడానికి రెడీగానే ఉన్నాడు. కాకపోతే… మహేష్ మహా బిజీ. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కించాడు. ఆ తరవాత వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యా గ్యాప్ వస్తే తన సినిమా లాగించేద్దాం అని పట్టుదలగా ఉన్నాడు పరశురామ్. ఇటీవలే మహేష్‌ని కలిసిన పరశురామ్.. కథ కూడా వినిపించాడట. మహేష్ కూడా `నీతో సినిమా చేస్తా` అని మాట ఇచ్చాడట. కాకపోతే.. ఆ సినిమా ఎప్పుడు? అనేదే పెద్ద సమస్య.
గీతా ఆర్ట్స్ లో ఈ సినిమా చేయాల్సివుంది. కానీ.. గీతా నుంచి పరశురామ్ బయటకు వచ్చేశాడు. దాంతో మహేష్ – పరశురామ్ కాంబో ఉండదేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ… తాజాగా మహేష్ – పరశురామ్ భేటీ అవ్వడం, మహేష్ మాట ఇవ్వడంతో ఈ సినిమాపై మళ్లీ పరశురామ్ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్టు పూర్తి చేసే పనిలో ఉన్నాడు పరశురామ్. వంశీ పైడిపల్లి తన సినిమాల విషయంలో చాలా టైమ్ తీసుకుంటాడు. తన దగ్గర మహేష్ కోసం లైన్ ఉంది కానీ, దాన్ని స్ర్కిప్టుగా పూర్తి చేయడానికి చాలా టైమ్ పట్టేస్తుంది. 2020 వేసవిలో వంశీ సినిమా మొదలవ్వాలి. ఏ కారణం చేతైనా ఆ సినిమా ఆలస్యం అయితే… పరశురామ్ సినిమా పట్టాలెక్కుతుంది. పరశురామ్ నమ్మకం కూడా అదే.