వంగవీటి రాధాకృష్ణకు.. రాజకీయం కలసి రావడం లేదు. వైసీపీలో .. జగన్మోహన్ రెడ్డి అవమానించడంతో… బయటకు వచ్చేసిన ఆయన… టీడీపీ వైపు చూశారు. తనను అవమానించిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో.. టిక్కెట్ ఇవ్వకపోయినా…ఆ పార్టీలో చేరి… ప్రచారం చేశారు. తన వంతు ప్రయత్నం తాను చేశారు. చంద్రబాబు కూడా ఆయనకు గౌరవం ఇచ్చారు. టీడీపీ సర్కార్ గెలిస్తే.. ఏదో పదవి ఖాయమనుకున్నారు కానీ.. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి సైలెంట్‌గా ఉంటున్న ఆయన… హఠాత్తుగా పవన్ కల్యాణ్‌తో గంట సేపటికిపైగా సమావేశమై.. రాజకీయ కలకలం రేపారు.
వంగవీటి రాధాకృష్ణ… ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు. దానికి సరైన వేదిక కోసం చూస్తున్నారు. ఆయన విజయవాడ తప్ప… మరో చోటకు వెళ్లి రాజకీయం చేసే అవకాశం లేదు. అయితే.. టీడీపీ తరపున ఏదో ఓ నియోజకవర్గాన్ని కట్టబెట్టే పరిస్థితి కూడా లేదు. వచ్చే ఎన్నికల లక్ష్యంగా.. ఇప్పటి నుంచే.. వంగవీటి రాధా తన రాజకీయ కార్యాచరణను ఖరారు చేసుకోవాలని… అనుకుంటున్నారని చెబుతున్నారు. టీడీపీలో అయితే.. చివరికి వరకూ.. నియోజకవర్గాన్ని ఖరారు చేయలేదు. ప్రస్తుతం.. విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమను కాదని.. వంగవీటికి ఇన్‌చార్జ్ పదవి ఇవ్వడం కూడా కష్టమే. అందుకే రాధా జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు.
అయితే.. పవన్ కల్యాణ్‌తో.. వంగవీటి రాధాకు అంత సన్నిహిత సంబంధాలేమీ లేవు. ప్రజారాజ్యం పార్టీ తరపున… వంగవీటి రాధా పోటీ చేసిన సమయంలో… ప్రచారానికి వస్తానని మాటిచ్చిన పవన్ కల్యాణ్… ఆరోగ్యం బాగోలేదని చివరి క్షణంలో హ్యాండిచ్చారు. అప్పుడు వంగవీటి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. పవన్ కల్యాణ్ ప్రచారానికి వచ్చి ఉండే.. గెలిచి ఉండేవాడినన్న భావన వంగవీటిలో ఉందంటారు. ఆ తర్వాత నుంచి పవన్ తో.. వంగవీటి సంబంధాలు కట్ అయ్యాయి. ఎన్నికలకు ముందు.. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత.. కొంత మంది జనసేనలోకి వెళ్లాలని ఒత్తిడి చేసినా.. ఆయన మాత్రం.. ఆ దిశగా కనీసం ఆలోచన కూడా చేయలేదు. మరి ఇప్పుడు.. ఏం ఆలోచిస్తున్నారో మరి.. !