కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ.. అలా ఆశ పెడుతుందో.. లేకపోతే.. ఆ పార్టీలోకి వెళ్లే నేతలు.. అంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో కానీ… ప్రతి ఒక్కరి.. బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అనే అనుకుంటున్నారు. అలా అనుకోవడమే కాదు.. తమతో పాటు కార్యకర్తల్ని, అనుచరుల్ని తీసుకెళ్లేందుకు.. దాన్నో సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా.. బీజేపీలో చేరేందుకు ఉత్సాహపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అని.. రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు.
ప్రస్తుతం కోమటిరెడ్డి… తనతో పాటు పెద్ద ఎత్తున నేతల్ని బీజేపీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రెండు, మూడు రోజుల్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. తనతో సన్నిహితంగా ఉన్న వారికి ఫోన్లు చేసి.. తనతో పాటు బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో.. ఓ నేతకు చేసిన ఫోన్ కాల్.. ఆడియో ఆన్‌లైన్‌లోకి వచ్చింది. తన నియోజకవర్గంలోని లక్కారం అనే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతకు రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేశారు. ” కాంగ్రెస్ బతకదు. రాహుల్ గాంధీయే రాజీనామా చేశారు. ఈ పార్టీ ముసలిది అయిపోయింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎంనవుతా. అందరం కలిసి బీజేపీకి పోదాం. ” అని … నచ్చ చెబుతున్న మాటలు బయటకు వచ్చాయి.
రాజగోపాల్ రెడ్డి.. తన అన్న వెంకటరెడ్డి నీడలో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ చలువతో.. భువనగిరి ఎంపీ టిక్కెట్ ఇప్పించుకుని ఓ సారి గెలుపొందారు. రెండో సారి గెలవలేకపోయారు. కానీ.. అన్నను మించిన రాజకీయం మాత్రం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై దూకుడైన విమర్శలు చేసి.. పదవి కోసం పట్టుబడుతున్నారు. పీసీసీ చీఫ్ ఇస్తే సరి లేకపోతే.. బీజేపీలోకి పోతానని చాలా కాలంగా పరోక్షంగా హెచ్చరిస్తూ వస్తున్న ఆయన.. ఇప్పుడు.. హైకమాండ్‌కు ఆ ఉద్దేశం లేదని తేలడంతో బీజేపీలోకి వెళ్తున్నారు. అయితే.. బీజేపీలో.. కింది స్థాయి నుంచి పాతుకుపోయిన అనేక మంది నేతలు ఉండగా… రాజగోపాల్ రెడ్డికి తానే సీఎం అనే నమ్మకం ఎలా వచ్చిందనేది.. చాలా మందికి అర్థం కాని విషయం. తనకు తానే ఊహించుకుంటున్నారా..? లేక బీజేపీ నేతలు… తమ పార్టీలోకి ఆహ్వానించడానికి అలాంటి ఆశలు రేపుతున్నారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.