తెలంగాణ పీపీసీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ హాట్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా కూడా కొత్త అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయ సేకరణ కూడా చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు వీళ్లతోపాటు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… కాబోయే పీసీసీ అధ్యక్షుడి రేసులో వీళ్లంతా ఉన్నట్టు కథనాలొచ్చాయి. జగ్గారెడ్డి కూడా రేసులో ఉన్నట్టు నిన్ననే ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తవారి ఎంపిక ఒకింత తలనొప్పిగానే మారినట్టుగా కనిపిస్తోంది.
కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చేసిన కుంతియా… పీసీసీలో మార్పు లేదని అనూహ్యంగా ప్రకటించారు! ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారనీ, ఇప్పట్లో కొత్త అధ్యక్షుడిని నియమించాలని భావించడం లేదని కుంతియా స్పష్టం చేశారు. ఉత్తమ్ ని మార్చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు! నిజానికి, ఉత్తమ్ పదవీ కాలం ముగుస్తోంది. ఆయన ఎంపీగా ఎన్నికయ్యాక… జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉండాలని భావించారు. దాంతో ఆశావహుల పేర్లు తెర మీదికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్న నాయకులకే పదవి ఇచ్చే ఉద్దేశంతో హైకమాండ్ ఉందనే కథనాలు వినిపించాయి. అయితే, అభిప్రాయ సేకరణ మొదలుపెట్టాక వాస్తవం కుంతియాకి బోధపడ్డట్టుంది.
కొత్త అధ్యక్షుడిగా రేవంత్ ని ఎంపిక చేస్తే… ఎప్పట్నుంచో పార్టీ ఉంటున్న తమను కాదని, కొత్తగా చేరినవారికి పార్టీ కీలక బాధ్యతలు ఇవ్వడమా అనే చర్చ వస్తుంది. తనకి పీసీసీ పగ్గాలిస్తే, అధికారంలో తెచ్చేవరకూ ప్రజల్లో ఉంటాని ఇప్పటికే చాలాసార్లు కోమటిరెడ్డి ప్రకటనలు చేశారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీకి దూరం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకి పదవి దక్కకపోతే, అదో తలనొప్పి కావడం ఖాయంగానే కనిపిస్తోంది. శ్రీధర్ బాబుకి ఇచ్చినా, జీవన్ రెడ్డికి ఇచ్చినా.. ఇలా ఎవరికి పదవి ఇచ్చినా మిగతా నాయకుల మూతివిరుపులుంటాయి. వారిని బుజ్జగించడం మరో ప్రహసనం! ఇప్పుడు పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం అంటూ జరిగితే… దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకోపక్క వలస మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడీ తేనెతుట్టెను కదిపితే… ఆ ఎన్నికల్ని కూడా నేతలు గాలికి వదిలేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించి… ప్రస్తుతానికి ఉత్తమ్ ని కొనసాగించడమే ఉత్తమమని అనుకున్నట్టున్నారు! అయితే, ఉత్తమ్ కొనసాగింపు మీద చాలామంది నాయకుల్లో వ్యతిరేకత ఉంది. ఆయన నాయకత్వ లోపం వల్లనే వరుస ఓటములు వచ్చాయన్న అసంతృప్తితో కొందరు నాయకులున్నారు.