ప్రియదర్శి నటించిన ‘మల్లేశం’కి మంచి మార్కులు పడ్డాయి. నిజాయతీతో కూడిన ప్రయత్నంగా విశ్లేషకులు ఈ సినిమాని అభినందిస్తున్నారు. చూసిన వాళ్లు తక్కువే అయినా – వాళ్లంతా ‘మంచి సినిమా’ అంటూ కితాబిస్తున్నారు. తెలంగాణ యాసనీ, అక్కడి ఆచారాన్ని నూటికి నూరు పాళ్లూ ఆవిష్కరించిన సినిమా ఇది. చింతకింది మల్లేశం అనే చేనేత కార్మికుడి జీవితం ఇది. ఈ సినిమాకి అవార్డులు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా ఇద్దరు పెద్ద హీరోల దగ్గరకు వెళ్లొచ్చేసింది. వాళ్లు ఈ కథ మరీ డాక్యుమెంటరీ రూపంలో ఉందని తోసి పుచ్చారు. ఆ హీరోలెవరో కాదు.. నాని, విజయ్ దేవరకొండ. ఈ కథ ముందు ఈ హీరోలకే వినిపించాడు దర్శకుడు రాజ్. వాళ్లు ‘నో’ అనడంతో పెద్ద హీరోలతో ఈ సినిమా వర్కవుట్ కాదన్న విషయం అర్థమైంది. చివరికి.. ప్రియదర్శి దగ్గరకు వెళ్లింది. హీరో ఇమేజ్ అనేది మల్లేశం పాత్రకు పెద్ద అడ్డంకి. స్టార్ హీరో ఉంటే ఓపెనింగ్స్ వచ్చేవేమో. ఈ సినిమాని ప్రియదర్శిలాంటివాళ్లతో తీయడమే కరెక్ట్. స్టార్ హీరో ఉండి ఉంటే, వాళ్ల ఇమేజ్‌కి తగ్గట్టు కథ పక్కదారులు పట్టేది. నాని, విజయ్‌లు నో చెప్పడం వల్లే ఈ కథకు పూర్తి న్యాయం జరిగింది. బహుశా దర్శకుడు రాజ్ అభిప్రాయం కూడా ఇదే కావొచ్చు.