గడచిన కొద్దిరోజులుగా తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరుతో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీలో వలసలు పర్వం మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలను ఆకర్షించిన భాజపా, ఇప్పుడు రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖ నేతల వలసల్ని ప్రోత్సహించే వ్యూహంతో ఉందనే కథనాలు గుప్పుమంటున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలను భాజపా ఆకర్షిస్తోందనీ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా భాజపా డీల్ చేస్తోందనీ, సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ కథనాలపై గంటా స్పష్టత ఇచ్చారు.
ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… తాను పార్టీ మారతానంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయనీ, వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు గంటా. ఎన్నికల ముందు కూడా ఇలానే తాను పార్టీ మారతానంటూ కొందరు కథనాలు ప్రసారం చేశారనీ, ఎన్నికలైపోయిన వెంటనే కూడా ఇదే తరహా చర్చలు జరిపారనీ, ఇప్పుడు మరోసారి తన పేరును వార్తల్లోకి తెస్తున్నారన్నారు. ఇవన్నీ అసత్య కథనాలనీ, తాను పార్టీ మారేదే లేదనీ, జై టీడీపీ అంటూ ట్వీట్ చేశారు.
మంగళవారం నాడు విశాఖలో నియోజక వర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని గంటా శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో గంటా మాట్లాడారు. అయితే, ఈ సమావేశం ప్రారంభం కాకముందే… పార్టీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకోవడం కోసమే ఈ సమావేశమంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. గంటా సమావేశంపై టీడీపీలో గుబులు పెరుగుతోందనీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ సమావేశం గురించి కూడా గంటా ఒక ట్వీట్ చేస్తూ… నియోజక వర్గంలో తాగునీటి సమస్య ఉందనీ, దీంతోపాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించామన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలూ సలహాలూ తీసుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం జరిగిందన్నారు. నలుగురు రాజ్యసభ ఎంపీలు అనూహ్యంగా ట్విస్ట్ ఇవ్వడంతో, ప్రముఖ టీడీపీ నేతలపై భాజపా కన్ను ఉందనే చర్చ జరుగుతూనే ఉంది. అందరి దృష్టీ గంటా మీదే ఎందుకంటే, ఆయన వరుసగా పార్టీలు మారుకుంటూ వచ్చారు కదా! అందుకే ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.