తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పట్లో మార్చే ఉద్దేశం లేదని కుంతియా ప్రకటించినా కూడా… ఆశావహులు తగ్గడం లేదు. కుంతియా ప్రకటనను టీ కాంగ్రెస్ నాయకులు పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా లేదు! ఎవరి అభిప్రాయాలు వారివే అన్నట్టుగా కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానంటున్నారు సీనియర్ నేత వీ హన్మంతరావు. పార్టీలో తనకంటే సీనియర్ నాయకుడు ఎవరున్నారని అంటున్నారు. తనకంటే విశ్వాసపాత్రుడు, దశాబ్దాలపాటు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడ్డ లాయలిస్టు ఎవరున్నారని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముగ్గురు రెడ్లు చేతుల్లో ఉందనీ, ఆ ముగ్గురూ ఏం సాధించారని ప్రశ్నించారు.
పీసీసీ పదవి ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి ఇవ్వాలా, గతంలో పొన్నాలకు ఇచ్చినా కూడా పార్టీ ఓడిపోయిన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారన్నారు వీహెచ్. పార్టీకి మొదట్నుంచీ లాయలిస్టుగా ఉన్నవారికి మాత్రమే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనీ, ఈసారి పీసీసీ బీసీలకే దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైకమాండ్ మీద కూడా కొన్ని విమర్శలు చేశారు. పారాచుట్ నేతలకు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానం ఉండదని గతంలో రాహుల్ గాంధీ అన్నారనీ, కానీ గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అలాంటి నాయకులకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అలాంటివారికే పార్టీలో కీలక పదవులు ఇచ్చారన్నారు. పార్టీలో లాయలిస్టుకు ప్రాధాన్యత పెరగాలనీ, జులై మొదటివారంలో పార్టీలోని లాయలిస్టులంతా సమావేశం కాబోతున్నారని వీహెచ్ చెప్పారు.
టి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నిబద్ధులంతా ఒక ప్రత్యేక వర్గంగా మారాలన్నది వీహెచ్ అభిప్రాయంగా కనిపిస్తోంది. అయినా, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందున్న సమస్య లాయలిస్టులు ఎవరు అనేది కాదు కదా! వరుస ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొంది. రానురానూ ప్రజలకు దూరమౌతోంది. మరోసారి ప్రజలకు చేరువ కావాలంటే ఏం చెయ్యాలి? ఎవరి నాయకత్వంతో పార్టీకి జనాకర్షణ వస్తుంది? ప్రజా సమస్యలపై పోరాటం ఎలా… ఇలాంటి అభిప్రాయాల ప్రాతిపదిక చర్చలు జరగాలి. అంతేగానీ, సీనియర్లుగా చెప్పుకునే నాయకులు కూడా రెడ్లకు ప్రాధాన్యత వద్దు, లాయలిస్టులకు పగ్గాలు ఇవ్వాలి అంటూ పార్టీలోనే మరింత విభజన తీసుకొచ్చే విధంగా వ్యాఖ్యానాలు చేస్తుంటే, పార్టీ బాగుపడేది ఎప్పుడు..?