ప్రజావేదిక కూల్చివేత తర్వాత… ఆక్రమణలపై జగన్మోహన్ రెడ్డి ఉక్కుపాదం మోపుతారని.. ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజధాని నగరం విజయవాడలో… అనేక చోట్ల.. ఆక్రమణలు పెరిగిపోయాయి. కొండల్ని.. గుట్టల్ని కూడా కబ్జా చేసేశారు. వాటి వల్ల అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోంది. కొండలపై ఇళ్లు నిర్మించడంతో.. కొండరాళ్లు జారిపడి జరుగుతున్న ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఇప్పుడు బెజవాడ అంతా.. జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. ఆక్రమణల నుంచి విముక్తి కావాలని కోరుకుంటోంది.
విజయవాడలో కాలువగట్లు, కొండల్ని కూడా ఆక్రమించేశారు.. !
విజయవాడలో ఆక్రమణలు ఎక్కువగా వన్ టౌన్ ప్రాంతం, క్రీస్తురాజపురం, చిట్టినగర్, గుణదల, మొగల్రాజపురం, సింగ్‌నగర్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న కొండలమీద ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. చిట్టినగర్ ప్రాంతంలో కొండలమీదకు ఏకంగా సిమెంటు రోడ్లు నిర్మించారు. ప్రసిద్ధి చెందిన మేరీ మాత ఆలయం ఉన్న గుణదల కొండలపై… ఇష్టం వచ్చినట్లుగా… నిర్మాణాలు వెలిశాయి. దీని వెనుక పెద్దల హస్తం ఉందని అందరికీ తెలుసు. అయినప్పటికీ.. ఇంత వరకూ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. విజయవాడలో దాదాపు 60వేల మంది ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారు. ఆక్రమణలకు కొండ ప్రాంతాలు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొన్ని అటవీశాఖవి కూడా ఉన్నాయి. నీటిపారుదల శాఖ స్థలాలను, కాలువ గట్లు ఆక్రమించి కూడా నిర్మాణాలు చేశారు. రైల్వే స్థలాల్లోనూ కొంతమంది ఆక్రమించారు. కొండలను ఆక్రమించుకున్న వారు దాదాపుగా 20వేల మంది ఉన్నారని అంచనా. 10వేల మంది కాలువ గట్లు ఆక్రమించారు.
ఇంత కాలం ఓటు బ్యాంక్ కోసం… నేతల అవినీతి..!
ఈ ఆక్రమణల్లో.. పేదలు ఉంటున్నప్పటికీ.. ఈ ఆస్తులన్నీ పెద్దలు అమ్ముకోవడమో.. అద్దెకు ఇవ్వడమో చేశారు. ఇదంతా పెద్దల పాపమే. ఇరవై ఏళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం వల్ల.. సామాన్యులు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ప్రతి ప్రభుత్వం.. ఆక్రమణలపై… కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని.. కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూ ఉంటారు కానీ.. ఒక్కరంటే.. ఒక్కరూ.. కూడా.. వీటిని కనీసం కట్టడి చేసే ప్రయత్నాలు కూడా చేయలేదు. పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉండటంతో.. ఎక్కడ ఓటు బ్యాంక్‌కు చిల్లు పడుతుందోనని.. రాజకీయ పార్టీలు భయపడ్డాయి. ఫలితంగా.. ఆక్రమణలు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటిని సరి చేసే సీఎం వచ్చారు.
జగన్ వాటన్నింటినీ తొలగించి మాటలు కాదు.. చేతలేనని నిరూపిస్తారా..?
గుణదల కొండపై.. ఆక్రమణలు మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ వివిధ మత సంస్థల పేరుతోనూ… ఆక్రమణలు పెరిగిపోయాయి. నిజానికి కొండలపై.. ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి.. ఆస్తి హక్కు ఉండదు. అది సహజసంపద. ప్రభుత్వానికి చెందుతుంది. అయితే.. రాజకీయ నేతల అండతో.. కబ్జాలు చేశారు. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. అలాంటివాటిని ఏమీ … పట్టించుకోనని.. కూల్చి తీరుతామని ప్రకటించారు కాబట్టి.. ఆక్రమణల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి.. ఆశలు చిగురించి. మరి జగన్మోహన్ రెడ్డి.. విజయవాడ వైపు చూస్తారా..? చంద్రబాబు… ఇంటితోనే సరి పెడతారా..? ఓటు బ్యాంక్ రాజకీయం కోసం.. ఇతర ఆక్రమణలు పట్టించుకోనని.. నిరూపిస్తారా..? అన్నది… మరో వారం రోజుల్లో తేలిపోనుంది.