భారతీయ జనతా పార్టీ ఆకర్ష్‌కి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఎమ్మెల్యే చిక్కారు. రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గౌడ్ ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. బీజేపీలో చేరేందుకు సంసిద్ధత ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ గరికపాటి మోహన్ రావుతో కలిసి.. అనగాని.. బీజేపీ నేతలను కలిసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న లంక దినకర్ కూడా.. బీజేపీ నేతలను కలిసినట్లు చెబుతున్నారు. ఆయన కూడా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రహస్యంగా బీజేపీ నేతలను కలిశారని.. వారు కూడా.. పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి.. ఏపీలో ఆ ప్రతిపక్ష హోదాను తాము దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. బీజేపీలో రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకున్న మోడల్‌లో టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుని… వైసీపీ సాయంతో.. ప్రతిపక్ష హోదా పొందుతారని చెబుతున్నారు. ఈ క్రమంలో… టీడీపీ ఎమ్మెల్యేలను… బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రధానంగా ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీలే చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. టీడీపీలో సుజనాచౌదరి, సీఎం రమేష్ చక్రం తిప్పారు. దాదాపుగా ప్రతి ఒక్కరికి వీరే టిక్కెట్ల దగ్గర్నుంచి ఆర్థిక అవసరాల వరకూ అన్నీ చూశారు. ఆ పరిచయాలతో ఎమ్మెల్యేలతో వీరు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
అనగాని సత్యప్రసాద్ గౌడ్ .. రేపల్లె నుంచి రెండో సారి టీడీపీ తరపున విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ఆయనకు… తెలంగాణ సర్కార్ నుంచి.. బెదిరింపులు వస్తే…చంద్రబాబు అండగా నిలబడ్డారు. వైసీపీ గాలిలోనూ… అనగాని.. రేపల్లెలో మంచి మెజార్టీ సాధించారు. అయితే.. ఆయనపై ఓడిపోయిన… మోపిదేవి వెంకటరమణకు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ఈ క్రమంలో… అనగాని బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం.. టీడీపీకి షాక్ లాంటిదే.