నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీ నుండి బీజేపీ లోకి ఫిరాయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం – తెలుగుదేశం పార్టీకి గడ్డు రోజులు దాపురించాయి అన్న చర్చ నడుస్తోంది. 2924 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కడుతుందా అన్న చర్చ కూడా మరొకవైపు నడుస్తోంది. ఇక లేటెస్ట్ గా, తోట త్రిమూర్తులు, వల్లభనేని వంశీ కూడా బీజేపీ లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక ను కూల్చడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ నిరసన వ్యక్తం చేస్తుంటే, తోట త్రిమూర్తులు మాత్రం ఇందులో తప్పేమీ లేదని, అనవసరంగా తెలుగుదేశం పార్టీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశమైంది పార్టీ మారడానికి సిద్ధమై పోవడం వల్లనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చర్చ బయలుదేరింది. అయితే తోట త్రిమూర్తులు మాత్రం వైసిపి లో చేరడానికి మొగ్గు చూపుతున్నాడని కానీ అక్కడ ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయి ఉండడం , పైగా పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు డిప్యూటీ సీఎంగా ఉండటం వంటి కారణాల వల్ల తోట త్రిమూర్తులు కి వైఎస్ఆర్ సిపి లోకి ఎంట్రీ దక్కే అవకాశం లేనట్లు పరిస్థితిలో ఉండడంతో ఆయన బీజేపీ వైపు చేరే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఆయనను బీజేపీలోకి చేర్చడానికి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ ఇటీవల చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మా కొట్టడం కూడా అనుమానాలను బలోపేతం చేస్తుంది. పార్టీకి వీర విధేయులు అనుకున్న నాయకులు కూడా పార్టీని వీడుతుండడంతో తెలుగుదేశం శ్రేణులలో కాస్త నిరుత్సాహం ఆవరించి ఉంది.
ఏది ఏమైనా ఈ అనుమానాలకి తెరపడాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.