గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తామే మేయర్ పీఠం అదిష్ఠించబోతున్నామనే ఆశ ఉన్నది. అయితే మేయర్ ఎవరో డిసైడ్ చేసేది ఎవ్వరు? ఆశావహుల కలలను తీర్చేది ఎవ్వరు? అంతిమంగా నిర్ణయం గులాబీ బాస్ కేసీఆర్ దే అయినప్పటికీ.. ఆయనతో యాక్సెస్ కార్పొరేటర్లు పోటీచేసిన అందరికీ సాధ్యమయ్యేదేనా? అందుకే.. మేయర్ పీఠంపై ఆశ ఉన్నవారంతా ఇప్పుడు మంత్రి కేటీఆర్ చుట్టూతా ముసురుకుంటున్నారు. ఈ తాకిడి ఎక్కువగా ఉంటుందనే కేటీఆర్ కూడా పోలింగ్ ముగిసిన వెంటనే ఢిల్లీ యాత్ర పెట్టుకుని వెళ్లిపోయారు. అయితే కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడగలిగిన స్థాయి నాయకులు, కేటీఆర్‌కు సన్నిహితులైన వారితో చెప్పించుకోవాలనుకునే వాళ్లు ఇలా… అందరూ ఎవరి పాట్లు వారు పడుతున్నారు.
లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పీఠం అనేది కేవలం ఉత్సవ విగ్రహం లాంటిది.. వారి చేతుల్లో అధికారాలు ఏమీ ఉండవు అని చెబుతుండవచ్చు గానీ.. మరో కోణంలో చూసినప్పుడు.. మన దేశంలోనే కొన్ని చిన్న రాష్ట్రాలకు ఉండే వార్షిక బడ్జెట్‌ను మించి.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ బడ్జెట్ ఉంటుందనేది వాస్తవం. అభివృద్ధి పనుల రూపేణా గ్రేటర్ నాయకత్వం చేతులమీదుగా ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చవుతూనే ఉంటాయి. అందుకే గ్రేటర్ పీఠం కోసం జరిగే ఎన్నికలు ఒక రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల తరహాలో ఉంటాయి తప్ప.. మునిసిపాలిటీలాగా ఉండవు. కార్పొరేటర్‌గా పోటీచేసేవారు.. ఎమ్మెల్యేరేంజిలో ఖర్చు పెట్టారంటే అతిశయోక్తి కాదు.
అయితే మేయర్ పీఠం అనేది అందరికీ తాయిలం లాంటిది. దానికి తగ్గట్లుగానే విజయం మీద కాన్ఫిడెన్సు ఉన్న తెరాస తమ పార్టీ తరఫున మేయర్ ఎవరో ముందుగా తేల్చలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. భాజపా-తెదేపా కూటమిగా పోటీచేశాయి గనుక.. గెలిచేస్థానాలను బట్టి డిసైడ్ చేసుకోవచ్చులెమ్మని ఆగిపోయాయి. ఇకపోతే.. తెరాసలో ఆ పదవిని ఆశిస్తున్న వారంతా కేటీఆర్‌ను ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయడానికి ఆరాటపడిపోతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్.. ఏదో రెండుసార్లు ప్రచార ప్రసంగాలు తప్ప.. అసలేమీ పట్టించుకోకుండా కొడుక్కే వదిలేశారన్నది సత్యం. అదే క్రమంలో మునిసిపల్ శాఖను కూడా కొడుక్కే కట్టబెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మేయర్ ఎంపిక కూడా కొడుకు ఇష్టానుసారమే జరుగుతుందని… అందుకే ఆయనను ప్రసన్నం చేసుకోవాలని అంతా ఎగబడుతున్నారని తెలుస్తున్నది.