ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నర్ణయాల్లో.. ఎక్కడో చోట అవినీతి జరిగి ఉంటుందని.. దాన్ని వెలికి తీసి పట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే.. ఆ నిర్ణయాలన్నింటినీ తిరగదోడి.. అన్నీ శోధించి… అక్రమాలను బయటకు తీయాలన్న ఉద్దేశంతో… ఓ మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. కీలక విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలను సబ్‌కమిటీ సమీక్షిస్తుంది. కార్పొరేషన్లలో తీసుకున్న కీలక నిర్ణయాలపైనా సమీక్ష చేస్తారు. మైనింగ్ లీజులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులనూ పరిశీలిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టులనూ జల్లెడపడతారు. ఐటీ ప్రాజెక్టులు, భూకేటాయింపులనూ సమీక్షించాలని.. ప్రభుత్వం ఆ కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా నెల రోజులు అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి… ఏపీ సర్కార్ పై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. వాటినే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. ఇలా చేయడంతో.. అధికారంలో ఉండి కూడా.. ఆరోపణలు చేయడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. తాము చేసిన ఆరోపణలు నిజమేనని తేల్చాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై పడినట్లయిది. అందుకే… అక్రమాలు నిగ్గు తేల్చడానికి… మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు. అయితే.. ఇందులో .. మంత్రులతో పాటు ఎంపీలకూ చోటు కల్పించారు. సభ్యులుగా మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్, గౌతంరెడ్డి ఉంటారు. అధికారవర్గం నుంచి ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ కు అవకాశం కల్పించారు.
సబ్‌కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కి చోటు కల్పించారు. ఇదే కాస్త ఆశ్చర్యకర నిర్ణయం. ఆహ్వానితులని చెప్పినా.. అసలు సబ్ కమిటీ చేయాల్సిన పని మొత్తాన్ని… విజయసాయిరెడ్డి చేస్తారని.. ఇప్పటికే అధికారవర్గాల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే.. సీఐడీ, విజిలెన్స్ లను కూడా ఉపయోగించుకోవాలని… ముఖ్యమంత్రి ఆదేశించడంతో… సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితునిగా.. విజయసాయిరెడ్డి… కీలకంగా వ్యవహరించబోతున్నారన్నారని చెబుతున్నారు.