ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అగ్ర కులాలకు కార్పొరేషన్లు పెట్టాలని నిర్ణయించింది. ఎన్నికల హామీల్లో భాగంగా… రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజికవర్గాల వారి సంక్షేమం కోసం.., కార్పొరేషన్లు పెట్టి.. ఆయా సామాజికవర్గాల్లోని పేదలను ఆదుకుంటామని ప్రకటించింది. అందులో మొదటి అడుగు వేసింది. బీసీ సంక్షేమ శాఖ నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడమే మిగిలింది.
అగ్రకులాల పేదలకు “కార్పొరేషన్” వరం..!
పేరుకే అగ్రకులాలు కానీ.. రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజికవర్గాల్లో పేదరికానికి కొదువ లేదు. ఆయా సామాజికవర్గాల్లో … కొన్ని రంగాల్లో… కొంత మంది గొప్ప స్థాయికి చేరడంతో… ఇక ఆ కులమంతా.. గొప్పదన్నట్లుగా… మొదటి నుంచి ప్రచారం జరిగింది. వారంతా… ఆ కారణంగానే.. ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉన్నారన్న అభిప్రాయంతో ఇప్పటి వరకూ.. ఏ ప్రభుత్వం కూడా… అగ్రకులం పేరుతో పేదలను పట్టించుకోలేదు. ఇప్పుడు.. ఏపీ సర్కార్ తొలి సారి.. ఆయన వర్గాల్లోని పేదల కోసం… కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. ఇది.. ఓ రకంగా.. పేదరికంలో మగ్గుతున్నా.. కులం కారణంగా.. ఏ సాయమూ పొందలేని వారికి ఉపయోగపడేదే.
రూ. 50 కోట్లతో ఎంత మందికి సాయం..?
అయితే.. ప్రభుత్వం ఒక్కో కార్పొరేషన్‌కు కేవలం.. రూ. 50 కోట్లు మాత్రమే కేటాయించాలనే ఆలోచన చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే.. ఆ కార్పొరేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. కార్పొరేషన్ పెడితే.. దానికి కొన్ని నియామకాలు చేపట్టాలి. ఇక రాజకీయ నియామకం కూడా ఉంటుంది. ఇక నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. ఏడాదికి.. రూ. 50 కోట్లు మంజూరు చేస్తే.. అవి వీటికే సరిపోతాయి కానీ.. పేదల వరకూ అందవన్న అభిప్రాయం ఉంది. కులం జనాభా… వారిలో పేదల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. కనీసం రూ. 500 కోట్లు అయినా కేటాయించాలన్న అభిప్రాయం మాత్రం ఉంది.
తమను అవమానించారనే భావం ఏర్పడితే కష్టమే..!
గత ప్రభుత్వం కాపులకు కార్పొరేషన్ పెట్టి ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. జగన్ ప్రభుత్వం రూ. రెండు వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇతర కులాలు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావన రాకుండా ఉండాలంటే… మరీ రూ. 50 కోట్లు కాకుండా.. వీలైనంత ఎక్కువ మొత్తం కేటాయించాల్సి ఉంటుందన్న అభిప్రాయం… వైసీపీలోనూ ఏర్పడుతోంది. పేరుకో అగ్రకులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే.. వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి..!