అమ్మాయిలకు సినిమాలెందుకు? అన్నచోట నటిగా, కథానాయికగా రాజ్యమేలారామె.
మొహానికి రంగు పూసుకుంటేనే అదో రకంగా చూస్తారనుకుంటే – `లైట్స్, కెమెరా, యాక్షన్` చెప్పి – డైరెక్టర్ కూడా అయిపోయారు.
తెర ముందే కాదు… తెర వెనుకా తన మ్యాజిక్ చూపించి, `గిన్నీస్ బుక్` ఎక్కేంతగా కీర్తి సంపాదించారు.
తనే.. విజయ నిర్మల. నటిగా, దర్శకురాలిగా ఆమె ప్రస్థానం, సాధించిన విజయం… ఎంతోమంది మహిళలకు మార్గ దర్శకం. సినిమాల్లో అమ్మాయిలెందుకు? అనే ప్రశ్నించిన వాళ్లంతా ఆమె విజయ ప్రస్థానం చూసి – నోరెళ్లబెట్టాల్సిందే.
ఈతరంలోనూ అమ్మాయిలు ధైర్యంగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారంటే దానికి కారణం ఒకప్పుడు విజయ నిర్మల వేసిన బాటే!
* మగరాయుడు
చిన్నప్పటి నుంచీ విజయ నిర్మల హుషారైన పిల్లే. చదువుతో పాటు.. ఇతర సాంస్క్రృతిక కార్యక్రమాల్లోనూ తన పేరు ముందే ఉండేది. ఇంట్లో అంతా మగ పిల్లలే. తనే ఒక్కగానొక్క ఆడపిల్ల. అందుకే ఇంట్లో చాలా గారాబం చేశారు. స్కూల్లో తన తోటి పిల్లలందరికీ ప్రతీ రోజూ చాక్లెట్లు పంచి పెట్టేది. డబ్బులు లేకపోతే.. అప్పు చేసి మరీ కొని ఇచ్చేది. చివరికి షాపు వాడు బాకీ వసూలు చేయడం కోసం విజయ నిర్మల ఇంటికెళ్తే.. ఈ అల్లరి పిల్ల చేసిన ఘన కార్యం బయటకు వచ్చింది. అమ్మ చివాట్లు పెట్టేసరికి.. ఇంకెప్పుడూ అప్పు జోలికి వెళ్లలేదు విజయ నిర్మల. చిన్నప్పుడే నాట్యం నేర్చుకుంది. ఏడవ ఏటనే బాల నటిగా వెండి తెరపై అడుగపెట్టేసింది. అయితే అప్పట్లో ఆమెకొచ్చినవన్నీ మగ వేషాలే. నటన అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే కెమెరా ముందుకు రావడం, చేసిన సినిమాల్లో సగానికిపైగా మగ వేషాలే వేయడంతో.. చిన్నప్పుడు ఆమెను మగరాయుడిలానే చూసేవారు.
* కృష్ణతో 47 సినిమాలు
ఓ హీరో – హీరోయిన్ కలసి ఎన్ని సినిమాలు చేస్తారు? హిట్ పెయిర్ అనిపించుకుంటే మహా అయితే… 5, 6 సినిమాలు చేస్తారు. కానీ.. కృష్ణ – విజయ నిర్మల కలసి ఏకగా 47 సినిమాలు చేశారు. ఇదో రికార్డు. వీరిద్దరూ కలసి నటించిన సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ అయిపోయాయి. ఇంత కంటే హిట్ పెయిర్ తెలుగు సినీ చరిత్రలోనే కనిపిస్తారా?
రంగులరాట్నం’ చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు విజయ నిర్మల. సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. అందులో 47 చిత్రాలు కృష్ణతోనే. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్నీ…. ఇవన్నీ విజయ నిర్మలకు నటిగా పేరు తీసుకొచ్చాయి.
* బాపు స్ఫూర్తిగా
విజయ నిర్మలకు బాపు అంటే చాలా ఇష్టం. ఆయన టేగింగ్, ఫ్రేమింగ్ని చాలా ఇష్టపడేవారు విజయ నిర్మల. ఆయన దర్శకత్వంలో `సాక్షి` చిత్రంలో నటించినప్పుడే దర్శకురాలవ్వాలన్న ఆలోచనకు బీజం పడింది. విజయ నిర్మల టేకింగ్లో, స్త్రీ పాత్రల్ని మలిచే విధానంలో బాపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకురాలిగా మారాక అక్కడ కూడా తన ప్రభంజనం చూపించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. మీనా, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు కూడా.
* గొప్ప జంట
కృష్ణ – విజయ నిర్మల…. ఒకరి గురించి చెప్పుకున్నప్పుడు మరొకరి ప్రస్తావన కూడా అవసరం. తెలుగు తెరపై వెలిగిన ఈ జంట.. నిజ జీవితంలోనూ ఏకమయ్యారు. వీళ్ల పెళ్లి కూడా విచిత్రంగానే జరిగింది. `సాక్షి` సినిమాలో తొలిసారి నటిస్తున్నప్పుడే… ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. కొంతకాలం సహజీవనం చేశాక – తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. నానక్ రామ్ గూడాలోని ఫామ్ హోస్లో కృష్ణ, విజయ నిర్మల ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. సామాజిక సేవలోనూ విజయ నిర్మల ముందుండేవారు. కల్యాణ లక్ష్మి పేరిట `మా` సభ్యులలో ఎవరికైనా పెళ్లి జరిగితే ఆమె ఆర్థిక సహాయం అందించేవారు. అంతేకాదు… తన ప్రతీ పుట్టిన రోజుకీ తన వయసెంతో అన్ని వేల రూపాయలు `మా`కి విరాళంగా ఇచ్చేవారు. `మా` తరపున ఏ కార్యక్రమం జరిగినా చేదోడు వాదోడుగా ఉంటూ తన వంతు సాయం చేసేవారామె. అలాంటి వ్యక్తిత్వం ఉన్న విజయ నిర్మల… అంతటి ప్రతిభా శాలి ఇప్పుడు కన్నుమూశారు. సెలవంటూ… వీడ్కోలు తీసుకున్నారు. ఆమె లేకపోయినా – విడిచి వెళ్లిన స్ఫూర్తి మనతోనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ…