తెలుగుదేశం పార్టీ కాపు నేతలు… సోమవారం చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు. చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు.. వీరంతా.. కాకినాడలో సమావేశం అయి.. కలకలం రేపారు. అయితే.. వైసీపీ.. లేకపోతే.. బీజేపీలోకి పోవాలన్న ప్రయత్నాల్లో వీరున్నారన్న ప్రచారం జరిగింది. అప్పటి సమావేశం ఏర్పాటు చేసిన తోట త్రిమూర్తులు భవిష్యత్తులో పార్టీ మనుగడ, కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై చర్చించారు. అయితే మీడియాలో కాపు నేతలంతా పార్టీ వీడతారని విస్తృత ప్రచారం జరగింది. దాంతో.. బొండా ఉమా, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు ఈ ప్రచారాన్ని ఖండించారు. తమకు పార్టీ మారే ఉద్దేశమేలేదని.. త్వరలో చంద్రబాబుతో సమావేశం కాబోతున్నామని ప్రకటించారు.
నిజానికి తమ సమావేశం గురించి కాపు నేతలు ముందుగానే చంద్రబాబుకు చెప్పారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తోట త్రిమూర్తులు, బొండా ఉమా ఇరువురు నేతలు చంద్రబాబు.. యూరప్ పర్యటనకు వెళ్లక ముందే సమావేశమయ్యారు. కాకినాడ భేటీ వివరాలను అధినేత దృష్టికి తెచ్చారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమావేశం కూడా జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత బొండా ఉమ..యూరప్‌లో ఉన్న చంద్రబాబుతో కూడా మాట్లాడారు. సమావేశంలో జరిగిన చర్చ గురించి ఉమా పూర్తిగా చంద్రబాబుకు వివరించారు. పార్టీ మారే ఉద్దేశం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అయితే.. ఆ తర్వాతే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయంటున్నారు.
కాకినాడ సమావేశంలో కొంత మంది పార్టీ మార్పుపై చర్చించారని.. టీడీపీ హైకమాండ్ కు సమాచారం అందిందని అంటున్నారు. అలా పార్టీ మార్పు గురించి మాట్లాడిన వారి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యాలయం.. ఓ అభిప్రాయసేకరణ జరిపింది. మీ నియోజకవర్గ నేత పార్టీ మారితే.. ప్రత్యామ్నాయ నేత ఎవరైతే … బాగుంటుందనేది.. ఆ అభిప్రాయసేకరణ సారాంశం. ఈ విషయం తెలిసి.. బొండా ఉమ, జ్యోతుల నెహ్రూతో పాటు మరికొంత మంది కాపు నేతలు అసంతృప్తికి గురయ్యారు. పార్టీ మారే ఉద్దేశం లేదని చెబుతున్నా.. ఇలా చేయడం ఏమిటని వారు.. అసంతృప్తికి గురయ్యారు. అందుకే .. చంద్రబాబుతో జరిగిన సమావేశానికి రాలేదు. అయితే.. ఫోన్ కాల్స్ గురించి తెలుసుకున్న చంద్రబాబు ఇలాంటి పని చేసిన వారిని ఉపేక్షించబోనని ఆయా నేతలకు హామీ ఇచ్చారు. సోమవారం సమావేశంలో మాట్లాడుకుందామని బుజ్జగించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.