బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎంనని చెప్పుకుంటూ.. ఆ స్థాయిలోనే… బీజేపీ అగ్రనేతలతో బేరాలాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి… పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. బీజేపీ నేతలు ఆయన్ను లైట్ తీసుకుంటున్నారు. మొదటి దశ చర్చల్లోనే.. ఆయన డిమాండ్లు చాలా అతిగా ఉన్నాయని భావించారేమో కానీ తర్వాత మాట్లాడటం తగ్గించేశారు. దాంతో.. నేడో రేపో పార్టీలో చేరిపోతానన్న ఆయన ఇప్పుడు.. మెత్తబడినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన వెంట పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు వస్తారని ఊహించుకుని ఓ పెద్దజాబితాలో ఆయన ఢిల్లీ వెళ్లినా… ఆయన తెచ్చిన జాబితాలో ఎవరూ బీజేపీలోకి ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశాల్లేవని బీజేపీ అగ్రనాయకత్వం గురించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను చేర్చుకుంటే.. ఆయన చేసే హడావుడికి ఇతర నేతల్లో అసంతృప్తి పెరిగిపోతుందని… భావించి.. రాజగోపాల్ రెడ్డిని బీజేపీ లైట్ తీసుకుంటోంది. అంతే కాదు.. కొంత మంది తెలంగణ బీజేపీ నేతలు కూడా.. రాజగోపాల్ రెడ్డికి అంత సీన్ లేదనే ప్రకటనలు కూడా చేస్తున్నారు.
అదే సమయంలో… తెలంగాణ నుంచి చేరికలను మాత్రం జోరుగా కొనసాగిస్తోంది. టీడీపీ నేత పెద్దిరెడ్డి సహా పలువురు నేతలను.. మురళీధర్ రావు.. బీజేపీలో చేర్చుకున్నారు. ఆ చేరికల్లో రాజగోపాల్ రెడ్డి కనిపించలేదు. అయితే అనూహ్యంగా.. రాజగోపాల్ రెడ్డి.. పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసుకి సమాధానం పంపారు. తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డికి వివరణ లేఖ పంపించారు. అందులో.. నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదనే వాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీ బాగుకోసమే సలహాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. గతంలోనూ మీరు నాకు నోటీసులు ఇచ్చారు, నేను వివరణ ఇవ్వలేదు … అంటే… మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినట్టే కదా..? అనే లాజిక్ లేఖలో పెట్టారు.
అప్పుడు తప్పు అనిపించని మీకు.. ఇప్పుడు ఎలా తప్పు అనిపించిందని ప్రశ్నించారు. నేను వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా .. టికెట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను నేను ఎక్కడా ధిక్కరించలేదని సమర్థించుకున్నారు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి… తాను షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వనే ఇవ్వనన్నారు. కానీ ఇచ్చారు. దాంతోనే… మెల్లగా… మళ్లీ కాంగ్రెస్‌లోనే కొనసాగడానికి సిద్ధమవుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది.