ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు ఎలాంటి ఆసక్తి ఉంటుందో… ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న తెలుగు రాష్ట్రాల నాయకుల గురించి తెలుసుకోవడంపై కూడా అంతే కుతూహలం నెలకొంది! తెలంగాణలో నాలుగు ఎంపీలు రాగానే… ఇక్కడ భాజపా విస్తరణ మొదలుపెట్టేస్తుందని అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే టి. కాంగ్రెస్ నేతలల్ని ఆకర్షించే పని పెట్టుకుంది భాజపా. పనిలోపనిగా తెలంగాణ టీడీపీలో కొద్దొగొప్పో నాయకులు మిగిలారు కదా, వారినీ చేర్చుకునే పనిలోపడింది భాజపా. ఈరోజు తెలంగాణకు చెందిన ఐదుగురు నాయకులు భాజపాలో చేరారు. ఆ విషయాన్ని భాజపా నాయకుడు మురళీధర్ రావు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి తోపాటు నాలుగు పర్యాయాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన బోడ జనార్థన్ భాజపాతో ప్రయాణించేందుకు సిద్ధపడ్డారని మురళీధర్ రావు చెప్పారు. జనార్థన్ గతంలో కార్మిక శాఖమంత్రిగా కూడా పనిచేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షుడిగా గతంలో పనిచేసిన చాడా సురేష్ రెడ్డి భాజపాలో చేరారని చెప్పారు. ఈయన హన్మకొండ పార్లమెంటు నియోజక వర్గం నుంచీ ప్రాతినిధ్యం వహించారని చెప్పారు. ఎన్నోయేళ్లుగా టీడీపీలో ఉన్న ఈయన, ఇప్పుడు భాజపాని బలోపేతం చేయడం కోసం వచ్చారన్నారు. మెదక్ నియోజక వర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన శశిధర్ రెడ్డి కూడా భాజపాలో చేరినట్టు ప్రకటించారు. ఈయన పీసీసీకి ఎక్స్ అఫీషియో మెంబర్ గా కూడా పనిచేశారన్నారు. కాంగ్రెస్ మైనారిటీ సెల్ కి స్టేట్ కన్వీనర్ గా పనిచేసిన షేక్ రెహ్మతుల్లా కూడా భాజపాలో చేరినట్టు చెప్పారు.
ఒకే రోజున టీడీపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు భాజపాలో చేరారు. వీలైనంత త్వరగా పార్టీకి పెద్ద సంఖ్యలో నాయకుల్ని జమచేసుకుంటే, ఆ తరువాత రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు అవసరమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే లోపే… నాయకుల్ని భాజపా లాగేసే వ్యూహంలో ఉంది. ఇక, టీడీపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రాలో అధికారంలో లేదు కాబట్టి, అక్కడ కూడా నాయకులు జంపింగులు చేస్తున్నారు కాబట్టి, తెలంగాణలో పార్టీని పట్టుకుని వేలాడితే ఏం ఉపయోగం అనే అభిప్రాయం టీటీడీపీ నేతల్లో బలంగా ఉంటుంది. అలాంటివారికి భాజపా నుంచి ఆహ్వానం రావడమే ఓ గొప్ప అవకాశం! ఇక, విడతలవారీగా భాజపాలో నేతల చేరికల జాబితాలు త్వరలో వస్తుంటాయన్నమాట.