ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు భాజపా నేతలు. ఇంకా ముగియలేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బతిమాలో బామాలో హోదా తెచ్చుకునే ప్రయత్నమే చేస్తామంటారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కలుస్తామంటారు, ఆయన మనసు మారాలని దేవుడ్ని కోరుకుంటామంటారు. ఆంధ్రాకి హోదా ఇవ్వాలంటూ తాజాగా అసెంబ్లీలో తీర్మానించిన సంగతి కూడా తెలిసిందే. అయితే, ఇదే అంశంపై ఏపీకి చెందిన భాజపా నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తప్పుతోవ పట్టించొద్దు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారామె!
మీరు కూడా ప్రత్యేక హోదా అంటూ తీర్మానాలను అసెంబ్లీలో పాస్ చేసుకున్న తీరును ఒక్కసారి గమనించుకోవాలని సీఎంని ఉద్దేశించి సూచించారు. ప్రత్యేక హోదా అనే పదాన్ని మాత్రమే తాము ఉపయోగించలేదుగానీ, తద్వారా రావాల్సిన లాభాలన్నీ రాష్ట్రానికి కేంద్రం అందిస్తోందన్నారు. అలాంటి సందర్భంలో గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని అడ్డుకునే విధంగా, స్పెషల్ పర్పస్ వెహికల్ ను నియమించేందుకు అడ్డుపడ్డారని విమర్శించారు. మీరు (ఏపీ సీఎం జగన్) కూడా అలాంటి తప్పు చెయ్యొద్దన్నారు పురంధేశ్వరి. కేంద్రం అన్ని విధాలుగా సహకరించేందుకు ముందుకు వస్తోందనీ, మీరు కావాలీ అంటే స్పందించే ప్రభుత్వం ఢిల్లీలో ఉందన్నారు! ఇలాంటి పరిస్థితుల్లో హోదా పేరు పదేపదే చెబుతూ ప్రజలను తప్పుతోవ పట్టించొద్దన్నారు!
భాజపాది మళ్లీ అదే పాతధోరణి..! ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశామని కాసేపు అంటారు. ఇస్తుంటే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారంటారు. ఇచ్చేశాం అని మాట్లాడుతున్నప్పుడు… చాలా అభివృద్ధి చేసేశాం అంటారు. ఆ అభివృద్ధి కంటికి కనిపించదేంటయ్యా అని ప్రశ్నిస్తే… చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే ఎక్కడ కనిపిస్తుందీ అనే అర్థంలో మాట్లాడతారు! ఏదేమైనా, ఏపీ ప్రత్యేక హోదా మీద భాజపా మళ్లీ మళ్లీ అసాధ్యమనే మాటే చెబుతోంది. ఆ పేరుతో ఏదీ అడగొద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సున్నితంగా సలహాలు కూడా ఇవ్వడం ఇప్పుడు మొదలుపెట్టేసింది. ప్రత్యేక హోదా తెస్తామంటూ ప్రజలను తప్పుతోవ పట్టించొద్దు అని పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యల్ని… కాస్త తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్రమంత్రులు, రాష్ట్ర నేతలు కూడా ఏపీకి హోదా అధ్యాయం సమాప్తః అనేస్తున్నారు. సీఎం జగన్ ప్రయత్నం మరింత ముందుకు కొనసాగక ముందే అంతిమ ఫలితాన్ని చెప్పేస్తున్నట్టే మాట్లాడుతున్నారు.