మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబానికి వరుసగా.. భద్రతను తగ్గిస్తూ వస్తున్న ఏపీ సర్కార్.. తాజాగా.. ఆయన కేవలం 2+2 కానిస్టేబుళ్లతో మాత్రమే సెక్యూరిటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇతర భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా.. చంద్రబాబుకు.. ఇద్దరు ప్రధాన భద్రతాధికారులు ఉంటారు. వారికి అనుబంధంగా ముగ్గురు ఆర్ఐల నేతృత్వంలో పదిహేను మంది సిబ్బంది ఉంటారు. ప్రభుత్వం వీరందర్నీ తొలగించింది. కేవలం… రెండు షిప్టుల్లో ఇద్దరేసి కానిస్టేబుళ్లను మాత్రమే ఉంచాలని నిర్ణయించింది.
చంద్రబాబు ఓడిపోయిన తర్వాత పోలీసులు.. ఆయన, ఆయన కుటుంబం భద్రత విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో మొదట స్థానిక పోలీసులు ఇవ్వాల్సి ఉన్న ఎస్కార్ట్, పైలెట్ క్లియరెన్స్ వాహనాలను తొలగించారు. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబసభ్యులకు కూడా భద్రత తొలగించారు. జడ్ కేటగిరిలో ఉన్న లోకేష్‌కు కూడా.. భద్రతను తగ్గించి.. షిప్టుకు ఇద్దరు చొప్పున.. నలుగురు కానిస్టేబుళ్ల భద్రతను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. అలాగే.. నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు ఇంటి వద్ద నుంచి కూడా భద్రతను ఉపసంహరించారు. ఇప్పుడు… నేరుగా చంద్రబాబుకే సెక్యూరిటీని ఉపసంహరించి ప్రభుత్వం కలకలం రేపుతోంది.
చంద్రబాబు గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్ఐ బృందాలతో చంద్రబాబుకు అప్పటి ప్రభుత్వాలు భద్రత కల్పించాయి. జగన్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా.. చంద్రబాబుకు సెక్యూరిటీని పూర్తి స్థాయిలో తగ్గిస్తోంది. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులు మందుపాతర పేల్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఆయనకు జడ్‌ప్లస్ భద్రతతో పాటు ఎన్ఎస్జీ భద్రత కల్పించారు. ఇప్పటికీ నక్సల్స్ హిట్‌లిస్ట్‌లో చంద్రబాబు పేరు ఉందని.. కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కారణాలతో భద్రత ఉపసంహరించడం రాజకీయ దుమారం రేపుతోంది. అసలు రివ్యూ కమిటీ మీటింగ్ జరగకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని… టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.