అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ నిర్ణయించారు. గతంలో ఉన్న వివాదాలను మరిచిపోయి.. రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉన్నామని ముఖ్యమంత్రులు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ప్రగతిభవన్లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో.. ప్రధానంగా నీటి వనరుల వినియోగంపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేసీఆర్ స్పష్టం సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ తెలిపారు.
నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని జగన్ సమావేశంలో ఆదేశించారు. నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థ వంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు. గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4వేల టిఎంసిల నీటి లభ్యత ఉందని కేసీఆర్ నిర్ధారించారు. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చని సూచించారు. ఈ సమావేశంలో.. ప్రధానంగా గోదావరి నీటిని శ్రీశైలంకు తరలింపు అంశంపైనే చర్చ జరిగింది. ఇతర విభజన సమస్యల గురించి పెద్దగా ప్రస్తావించలేదు. సమావేశం తర్వాత మధ్యాహ్న భోజనాన్ని ముఖ్యమంత్రులిద్దరూ కలిసే చేశారు.