చాలా ఇళ్ల ముందు ” కుక్క ఉన్నది జాగ్రత్త ” ” బివేర్ ఆఫ్ డాగ్ ” అనే బోర్డులు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. నిజంగా కుక్క ఉన్నా.. అది.. కొత్త వ్యక్తుల్ని చూసి పారిపోయే రకం విదేశీ కుక్క అయినా సరే… ఆ బోర్డులు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటారు. ఎందుకంటే… ఇంట్లోకి చొరబడాలనుకునేవాళ్లు కొద్దిగా అయినా.. భయపడతారని. ఇప్పుడు… అమరావతిలో ఇళ్ల యజమానులు.. చాలా కొత్తగా ఇదే పద్దతని అవలంభిస్తున్నారు. ముఖ్యంగా కరకట్ట మీద భవనాలు కట్టుకున్న వారు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హడావుడి చూసి… సింపుల్‌గా… ఓ నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు అంటించడానికి సీఆర్డీఏ అధికారులు వస్తున్నారని తెలుసుకుని.. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా.. తమకు ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ డీటైల్స్‌ను.. చాలా పెద్దగా రాసి… బోర్డుకు వేలాడదీస్తున్నారు.
చంద్రబాబు ఉంటున్న ఇల్లు యజమానికి లింగమనేని రమేష్‌కు.. ఈ ఐడియా రాలేదేమో కానీ.. కరకట్ట పక్కనే ఉన్న ఇతర ఇళ్ల యజమానులకు వచ్చింది. దాదాపుగా అందరూ.. బడాబాబులే కావడంతో… తమ పర్మిషన్ వివరాలతో బోర్డు తయారు చేసి.. గేటుకు వేలాడదీస్తున్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు ఆ బోర్డులు షాకిస్తున్నాయి. వాటిపై వివరాలు రాసుకుని… సీఆర్డీఏ ఆఫీసుకు వెళ్లి ఫైల్స్ వెదుకుతున్నారు. కానీ.. ఆ పర్మిషన్లు అన్నీ సీఆర్డీఏ ఏర్పడక ముందు.. 2004 నుంచి 2014 మధ్యలో తెచ్చుకున్నవే.
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ” విజయవాడ – గుంటూరు – తెనాలి – మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ” వీజీటీఎం ఉడాకు చైర్మన్ గా ఉన్నప్పుడు.. ఇచ్చిన పర్మిషన్లే అవి. అప్పుడు సీఎంగా వైఎస్ ఉన్నారు. చివరికి చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఎస్టేట్ కి కూడా.. అప్పట్లోనే పర్మిషన్లు వచ్చాయి. ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి .. ఇప్పుడు ఆ ప్రభుత్వమే అక్రమం అని నోటీసులిస్తే… ఎలా అనే వాదన వినిపిస్తోంది. వైఎస్ హయాంలో ఇచ్చిన పర్మిషన్ల గుట్టును బయటకు తీస్తే.. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని.. ఆందోళన చెందుతున్నారు.