2023లోపు జమిలీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని జనసేన నిర్ణయించింది. వచ్చే నెల పూర్తయ్యే లోగా అన్ని కమిటీలను సిద్దం చేసి.. స్థానిక సంస్థలు, జమిలీ ఎన్నికలకు సిద్దం చేస్తూ.. వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఎపీ వ్యాప్తంగా జనసేనకు క్యాడర్ ఉన్నప్పటికీ.. వారిని నడిపంచే నాయకత్వం లేకపోవడం వల్లే ఈ ఎన్నికలలో ఓటమి తప్పలేదని ఇప్పటికే సమీక్షల ద్వారా నిర్ణయించారు. ఈ లోపాన్ని సరిపుచ్చుకుని ముందడుగు వేయబోతున్నారు.
గ్రామస్థాయి నుంచే జనసేనను బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో పార్టీ తరపున 18కమిటీలను ఏర్పాటు చేయాలని భావించిన పవన్.. ఎనిమిది కమిటీల అధ్యక్షులను ప్రకటించారు. ఇతర కమిటీల సభ్యులను కూడా ప్రకటించి.. వారి ద్వారా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలలో కమిటీలు వేసి క్యాడరంతా కలిసిమెలిసి జనసేనను జనాల్లోకి తీసుకువెళ్లేలా చూడాలని పవన్ సూచించారు. అంతే కాక ఆయనే స్వయంగా సమావేశాలు నిర్వహిస్తూనే… మరోవైపు జిల్లాల వారీగా పర్యటనలు చేసి క్యాడర్ లో మరింత ఉత్తేజాన్ని నింపాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు రోజుల చొప్పున సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. లోక్ సభకు పోటీ చేసిన పార్టీ అభ్యర్థితోపాటు ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ ఉంటుంది. వీరితోపాటు ఆయా నియోజకవర్గాల్లో జనసేన కోసం బలంగా పని చేసిన ముఖ్య నాయకులూ సమీక్షలో పాల్గొంటారు. నియోజకవర్గాలవారీగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన, అక్కడి స్థానిక అంశాలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలపైనా, అక్కడి ప్రజల, పార్టీ శ్రేణుల ఆకాంక్షలపైనా చర్చిస్తారు.
పవన్ కల్యాణ్ అమెరికా పర్యటన అనంతరం జులై నెల రెండో వారం నుంచి ఈ సమావేశాలు మొదలవుతాయి.
భీమవరం, గాజువాక నియోజకవర్గ కేంద్రాలతోపాటు అనంతపురంలో జనసేన కార్యాలయాలు ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. భీమవరం, నర్సాపురం నియోజకవర్గాల్లోనూ మరికొన్ని ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో జనసేన కోసం పనిచేసిన శ్రేణులను, నాయకులను ఇబ్బందిపెడుతున్న విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. శ్రేణులకు అండగా నిలవడానికి ఏం చేయాలన్న దానిపై చర్చించారు. నియోజకవర్గాల్లో పార్టీ కోసం సేవ చేస్తున్న ముఖ్య నాయకులను గుర్తించి వారికి కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ నిర్ణయించారు. జనసేన ప్రజల్లో ఉండేలా పవన్ ఘనమైన ప్రణాళికలే సిద్ధంచేస్తున్నారు.