తెలుగు రాష్ట్రాల్లో బలపడాలి అన్న మిషన్ తో పని చేస్తున్న బీజేపీ వ్యూహకర్తలు అందుకు సహకరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులని ఇప్పటికే కొంతమందిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు కర్నూలు జిల్లా మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కానీ మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం కానీ త్వరలోనే బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గానికి మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వర్గానికి ఎప్పటి నుండో ఆ రాజకీయ వైరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అన్నీ తెలిసి కూడా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టు, ఇద్దరు నేతలు ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అధికారం ఉంటే అది వేరే సంగతి కానీ అధికారం లేక పోతే వీరిద్దరిని ఒకే ఒర లో ఉంచడం చాలా కష్టం. బహుశా ఇది తెలిసి బీజేపీ పెద్దలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే కోట్ల ఏ విషయము తేల్చకపోవడంతో బీజేపీ పెద్దలు కెఈ కృష్ణమూర్తి తో కూడా సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు కి ముందు చాలా గడ్డుకాలం ఉందని , తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఒక మైండ్ గేమ్ కు తెరతీశారు. దీంతో చాలా మంది టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి లాంటి వారిలో కూడా రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన ఉండటం సహజమే. ఆ ఆందోళనని ఆసరా చేసుకుని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు.
ఇద్దరిలో ఎవరు బీజేపీ వలకు చిక్కుతారు అన్నది ప్రస్తుతానికి కర్నూలు జిల్లాలో సస్పెన్స్ గా మారింది. అయితే ఇద్దరిలో ఎవరు ముందుగా బీజేపీ లోకి వెళ్ళినా, రెండవ వారు బీజేపీలోకి వెళ్లే ప్రతిపాదనను విరమించు కొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఎవరు బీజేపీలోకి వెళతారో ఎవరు తెలుగు దేశం పార్టీ లోనే కొనసాగుతారో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.