గన్నవరం నిమానాశ్రయం నుంచి ఉన్న ఒకే ఒక్క అంతర్జాతీయ విమానసర్వీస్ రద్దయిపోయింది. వయబిలిటి గ్యాప్ ఫండింగ్ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఏపీ సర్కార్ అంగీకరించకపోవడంతో… ఇండిగో సర్వీసుల్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీంతో… మొదటగా.. ఒక్కటితో ప్రారంభించి.. గన్నవరం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెంచాలనుకున్న లక్ష్యానికి గండి పడింది.
గన్నవరం ఎయిర్ పోర్ట్ కు 2017 మే 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. కానీ ఒక్క సర్వీసును కూడా ప్రారంభించలేదు. ఏపీ సర్కార్ వయబిలిటీ గ్యాప్ విధానంతో ముందుకొచ్చి టెండర్లను పిలిచింది. ఈ టెండర్లలో సింగపూర్ సర్వీస్ నడిపేందుకు ఇండిగో ముందుకొచ్చింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో 50 శాతంకంటే తక్కువ సీటింగ్ కు టిక్కెట్లు బుక్ అయితే.. ఒక్కోసీటు కింద ఇంత అని టికెట్ ధర ఇండిగో సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతంకంటే ఎక్కువ ఉంటే అవసరం ఉండదు. ఈ విధానంలో భాగంగా ఇండిగో సంస్థ 180 మంది సీటింగ్ ఉన్న ఇండిగో విమానాన్ని నడపడం ప్రారంభించింది.
అయితే… సింగపూర్ – విజయవాడ విమానానికి ఆదరణ బాగుంది. ఒక్క రూపాయి కూడా.. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ చేయాల్సిన అవసరం సర్కారుకు రాలేదు. ఆక్యూపెన్సీ 90 నుంచి వంద శాతం వరకూ ఉంది. అయితే.. ఈ సర్వీసుకు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం జూన్ 31వ తేదీతో ముగుస్తుంది. ఒప్పందం కొనసాగించడానికి ఏపీ సర్కార్ ఆసక్తి వ్యక్తం చేయలేదు. ఇప్పటి వరకూ.. అవసరం రాలేదు కదా.. ఇక ఒప్పందం ఎందుకన్నట్లుగా.. ఇండిగోతో… మాట్లాడటంతో.. ఆ సంస్థ .. సర్వీస్ ఆలోచన విరమించుకుంది. తన సర్వీసును శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్ లైన్ బుకింగ్ ఉండటంతో ఈ ప్రయాణికుల్ని వేరే సర్వీసుల్లోకి సర్దుబాటు చేయాలని తమ సిబ్బందిని ఆదేశించింది. చివరి సర్వీసులో సింగపూర్ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రభుత్వం స్మూత్‌గా డీల్ చేస్తే అయిపోయేదానికి.. కఠినంగా వ్యవహరించడంతో.. గన్నవరం మళ్లీ లోకల్ అయిపోయినట్లయింది.