ఆమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో.. మొట్టమొదటగా బాధితులుగా మారుతోంది.. భూములిచ్చిన రైతులే. రెండు, మూడు పంటలు పండే భూముల్ని.. నవ్యాంధ్ర రాజధాని కోసం.. అలవోకగా.. ఇచ్చేసిన ఆ రైతులు ఇప్పుడు.. ప్రభుత్వానికి కానివారయ్యారు. ప్రభుత్వం మారడం… అమరావతి అనే దాన్ని కొత్త ప్రభుత్వం… ఓ అవినీతి కూపంలా చూడటంతోనే అసలు సమస్య ప్రారంభమయింది. భూములిచ్చిన రైతుల్ని.. ఏపీ సర్కార్ మరో విధంగా ట్రీట్ చేస్తోంది. అదే అలజడికి కారణం అవుతోంది.
రాజధాని రైతులకు కౌలూ అందలేదు..!
రాజధానికి భూములిచ్చిన వారికి.. పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. మెట్టకు ఎకరాకు రూ.30 వేలు, జరీబుకు రూ.50 వేలు సంవత్సారానికి కౌలు చెల్లించే విధంగా ప్రభుత్వం రాజధాని రైతులతో ఒప్పదం చేసుకుంది.అందులో బాగంగా.. ఇప్పటి వరకూ.. ఏటా కౌలు చెల్లింపులు మే లేదా జూన్ మొదటివారంలో ఇచ్చేవారు. ఈ సారి ఇంకా ఇవ్వలేదు. దాదాపు రూ.170 కోట్లు కౌలు రైతులకు జమ చేయాల్సి ఉంది. సీఆర్డీయే అధికారులు వస్తాయో.. రావో అన్నట్లుగా చెబుతున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన ప్రారంభమయింది.
భూములిచ్చిన వాళ్లని టీడీపీ నేతలుగా ట్రీట్ చేయడం ఎందుకు..?
రాజధానికి భూములు ఇచ్చి.. వారు త్యాగం చేశారు.. అయితే.. అలా త్యాగం చేయడమే… వారి తప్పయిపోయినట్లయింది. ప్రస్తుత సర్కార్.. వారిని.. టీడీపీ నేతలుగా చూస్తున్నారు. వారి గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కొత్త సర్కార్ వచ్చిన తర్వాత అమరావతి గురించి.. ఒక్కటంటే.. ఒక్క విస్పష్ట ప్రకటన ప్రభుత్వం నుంచి రాలేదు. అవినీతి పేరుతో.. హంగామా చేస్తున్నారు. దాంతో.. రైతుల్లో ఆందోళన ప్రారంభమయింది. తమ భూములు ఎక్కడ ఇరుక్కుపోతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబే దిక్కనేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందా..?
ప్రభుత్వం మారినా.., అమరావతి విషయంలో.. పెద్దగా మార్పులుండవని.. రైతులు భావించారు. అందుకే.. రాజధాని ఏరియా సహా.. అన్ని చోట్లా వైసీపీనే గెలిచింది. స్వయంగా.. రాజధాని గ్రామాల్లోనూ.. వైసీపీకి మెజార్టీ వచ్చింది. అంటే రైతులు కూడా…మద్దతు తెలిపినట్లే. అయితే.. కొత్త ప్రభుత్వం రైతులకు.. భరోసా ఇవ్వలేకపోయింది. అందుకే.. రైతులు మళ్లీ చంద్రబాబు వద్దకు వెళ్లాల్సి వచ్చింది. తమ సమస్యలపై అసెంబ్లీలో పోరాడటానికి..కమిటీ వేయాలని.. చంద్రబాబును కోరాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా.. ప్రజాసంక్షేమం పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రిగా రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినప్పుడు.. జగన్ అదే చెబుతారు. ఇప్పుడు… తమ పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదని.. రాజధాని రైతులు అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో..?