తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులుగా… మైహోమ్ గ్రూప్ సంస్థల యజమాని, ప్రముఖ మీడియా సంస్థల అధిపతి అయిన.. జూపల్లి రామేశ్వరరావు పేరు దాదాపుగా ఖరారయినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే.. టీటీడీ బోర్డు చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ.. బోర్డు సభ్యులను మాత్రం నియమించలేదు. పది రోజుల్లో నియమిస్తామని.. అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ కసరత్తు జరుగుతోంది.
సాధారణంగా.. టీటీడీ బోర్డులో… పొరుగు రాష్ట్రాల నుంచి… ఒక్కో ప్రతినిధిని తీసుకుంటూ ఉంటారు. తిరుమలకు అత్యధికంగా భక్తులు వచ్చే రాష్ట్రాలు… తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచే కాకుండా.. మహారాష్ట్రతో పాటు.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై వచ్చే ఒత్తిడి ప్రకారం.. ఇతర రాష్ట్రాల వారికీ అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి మాత్రం కచ్చితంగా ఒకరికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తెలంగాణ నుంచి… అప్పట్లో టీడీపీలో ఉన్న సండ్ర వెంకటవీరయ్యకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం… ఏపీ సర్కార్.. తెలంగాణ నుంచి ఎవర్ని నియమించాలన్నదానిపై.. సొంత నిర్ణయం తీసుకోవడం లేదు. టీఆర్ఎస్కు ఆ చాయిస్ ఇచ్చింది. ఆ ప్రకారం… జూపల్లి రామేశ్వరరావు పేరును ప్రతిపాదించిటన్లుగా తెలుస్తోంది.
జూపల్లి రామేశ్వరరావు ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాదు… ఆయన ఆధ్యాత్మిక వేత్త కూడా. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆయన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఆయనకు దైవభక్తి మెండు. ఆయన నుదుట ఎప్పుడూ …బొట్టు ఉంటుంది. ఆయన ఆసక్తి మేరకు.. ఆయనకు.. టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వాలని కేసీఆర్ సిఫార్సు చేసినట్లు.. దానికి ఏపీ సర్కార్ అంగీకరించిటన్లుగా తెలుస్తోంది. అందరి సభ్యులతో పాటు ఆయన పేరునూ ప్రకటించే అవకాశం ఉంది.