కాలేజీ క్యాంటీన్లకు బోలెడంత చరిత్ర ఉంది. ఒకప్పుడు కాలేజీ రాజకీయాలు, ప్రేమకథలు క్యాంటీన్ల చుట్టూనే తిరిగేవి. అలాంటి కాలేజీ క్యాంటీన్లో పాట పెట్టి – యూత్‌ని తనవైపుకు తిప్పుకున్నాడు రాంగోపాల్ వర్మ. `శివ`లో.. `బోటనీ పాఠముంది.. మాటనీ ఆట ఉంది` కాలేజీ క్యాంటీన్ పాటల్లో జాతీయ గీతం అని చెప్పొచ్చు. ఆ తరవాత.. కాంటీన్ పాటలు కొన్ని సినిమాల్లో హల్ చల్ చేశాయి. కానీ.. ఏదీ అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు `డియర్ కామ్రేడ్`లో ఓ క్యాంటీన్ పాట వచ్చింది. ఇది మాత్రం `శివ` నాటి రోజులు గుర్తు చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ఇది. భరత్ కమ్మ దర్శకుడు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు యూత్‌ఫుల్‌గానే సాగాయి. ఈపాటైతే యూత్‌కి మరింత బాగా నచ్చేస్తుంది. క్యాంటీన్లో ప్రేమకథల్ని గుర్తు చేస్తూ సాగిన ఈ పాటలోని పదాలు, బాణీ… యువతరానికి నచ్చేలా ఉన్నాయి. కొన్నాళ్ల పాటు.. ఈ క్యాంటీన్ పాట హోరెత్తించడం ఖాయం. ఒక్కో పాటనీ ఒక్కో రకంగా డిజైన్ చేశాడు దర్శకుడు. ఈ పాటలే డియర్ కామ్రేడ్ కి సగం బలం అనిపిస్తోంది.