హైదరాబాద్: విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని నిన్న తనపై చేసిన వీరంగానికి పవన్ స్పందించారు. తెలుగువారికోసం జైలుకెళ్ళటానికైనా, న్యాయస్థానాలకెళ్ళటానికైనా సంతోషిస్తానని ట్విట్టర్లో పేర్కొన్నారు. కేసులు పెట్టాలనుకునేవారు ఆ ఏర్పాట్లు చేసుకోవాలంటూ సూచించారు. సీమాంధ్ర ఎంపీలు తనమీద కాకుండా, కేంద్రం దగ్గర తమ పౌరుషం చూపాలని అన్నారు. తనను తిడితే ప్రత్యేక హోదా రాదని పేర్కొన్నారు. ఎంపీలు వ్యాపారం చేయటం తప్పుకాదని, అయితే వ్యాపారంమాత్రమే చేయటం తప్పనికూడా పవన్ ట్వీట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ విమర్శలపై నాని మాట్లాడుతూ, తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. అవసరమైతే అతనిపై కేసులుకూడా పెడతామంటూ నాని హెచ్చరించారు. దానిపైనే పవన్ ఇవాళ స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీలు నాని, కొనకళ్ళ విమర్శలపై పవన్ అభిమానులు మండిపడ్డారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలలో వారు ఆందళనలు నిర్వహించారు, నాని దిష్టిబొమ్మలు తగలబెట్టారు. విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ దగ్గర ఆందోళనకు దిగిన అభిమానులు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటం చేతకాని టీడీపీ ఎంపీలు తమ నాయకుడు ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తమ నాయకుడులేకుంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదా అని వారు ప్రశ్నించారు. దమ్ముంటే ఈ పార్లమెంట్ సమావేశాలలో ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. నాని నోరు అదుపులో పెట్టుకోకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ ఆందోళనను జనసేన తరపున చేస్తున్నారా అని విలేకరులు అడగగా, తమ నాయకత్వం సూచనలమేరకు కాదని, తమంతట తామే చేస్తున్నమని వారు తెలిపారు.
మరోవైపు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ప్రత్యేకహోదాకోసం తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తెలియకే పవన్ అలా మాట్లాడారని అన్నారు. ప్రత్యేక హోదాకోసం పవన్ తమతో కలిసొస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.