ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుభవరాహిత్యం.. ఏదైనా చిటికెలో చేయగలమన్న అత్యుత్సాహంతో.. ప్రజల ముందు పలుచన అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల రోజుల పాలనలో.. ఇప్పటి వరకూ చాలా ప్రకటనలు వచ్చాయి కానీ.. ఏదీ కూడా కార్యక్షేత్రానికి చేరలేదు. తొలి సారిగా… ప్రజాదర్బార్‌ను.. జగన్మోహన్ రెడ్డి జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారని.. ఆయన క్యాంప్ ఆఫీసులో… ప్రజలను కలుస్తారని ప్రకటించారు. జూన్ 29వ తేదీన సీఎంవో నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతీ రోజూ.. ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని గొప్పగా ప్రకటించారు.
జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఓ వైపున ఆయన కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటానికి ఏర్పాట్లు చేశారు. వేచి ఉండే వారికి మంచినీటి సదుపాయం, పెద్ద ఫ్యాన్లు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు, నివేదనలను ముఖ్యమంత్రి స్వీకరిస్తారు.సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని అధికారులు ప్రకటించారు. అంతా రెడీ అయిన తర్వాతే.. సీఎంవో అధికారికంగా మీడియాకు తెలిపి ఉంటుంది. అయితే.. ఒక్క రోజులోనే.. మళ్లీ … ఏర్పాట్లు పూర్తి కాలేదని.. ఆగస్టు ఒకటో తేదీకి.. ప్రజాదర్బార్‌ను వాయిదా వేసినట్లుగా ప్రకటించారు.
ప్రజాదర్బార్ గురించి అధికారికంగా ప్రకటించేటప్పుడు.. ఏర్పాట్ల గురించి అధికారులు రివ్యూ చేసుకోకుండా ఉంటారా.. అన్న సందేహం రాకుండా మానదు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం… తర్వాత.. వాయిదాలు వేసుకోవడం వంటివి.. ప్రజల్లో చులకన భావం తీసుకు వస్తాయి. ప్రజాదర్బార్ విషయంలో ఇదే కనిపిస్తోంది. ఆర్భాటంగా ప్రకటించిన .. ఒక్క రోజులోనే.. మరో నెలకు… వాయిదా వేసేశారు. ఈ ధోరణి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది. ముందూ వెనుకా ఆలోచించకుండా నిర్ణయాలు ప్రకటిస్తారనే భావన తెస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతుంది.