హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను కాపులపై ఉసిగొల్పుతున్నారని కాంగ్రెస్, వైసీపీ పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ, కాపులకు, బీసీలకు మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. గతంలో మాల, మాదిగల మధ్య ఇలాగే చిచ్చు పెట్టారని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. బీసీలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించదని హెచ్చరించారు. ఇవాళ జరుగుతున్న బీసీల కలెక్టరేట్ ముట్టడి వెనక ఉన్నది చంద్రబాబేనని ఆరోపించారు. కాపుగర్జనకు హాజరైతేనే కేసులుపెడితారా అని ప్రశ్నించారు. ఆ సభలో ముద్రగడ ఒక్కరే మాట్లాడారని చెప్పారు.
మరోవైపు బొత్స సత్యనారాయణ తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ, చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. తుని సభకు అనుమతి ఇచ్చామని సీఎమ్, ఇవ్వలేదని పోలీసులు అంటున్నారని, ఎవరి మాటలు నమ్మాలని అడిగారు. తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించటాన్ని తప్పుబట్టారు. బయటివ్యక్తులు ఎవరూ రావద్దని ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నించారు. బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యనుద్దేశిస్తూ, తెలంగాణలో 23 కులాలను బీసీ జాబితాలోనుంచి తొలగిస్తే ఎందుకు మాట్లాడలేదని అడిగారు.