జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించ లేక పోయినప్పటికీ, సామాన్యులకు సైతం టికెట్లు ఇవ్వడం, డబ్బు మద్యం పంచకుండా ఎన్నికలను ఎదుర్కోవడం లాంటి చర్యలతో చాలా మంది ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే జగన్ ఏడేళ్లకు పైగా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దీటైన ప్రతిపక్షంగా ఎదగడం, జనసేన కు ఓటేస్తే చంద్రబాబు మళ్లీ ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి అవుతాడు ఏమో అన్న అనుమానాలు జనసేన అవకాశాలను ఘోరంగా దెబ్బ తీశాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిలబడతాడా లేక తడబడతాడా అని కాసింత ఆందోళన చెందిన అభిమానులకు, తిరిగి సినిమాల్లోకి వెళ్లకూడదని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా రాజకీయాల్లోనే కొనసాగడం గురించి తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్న వైనం కాస్త ఊరట నిచ్చింది.
రైతుల సమస్యలపై స్పందిస్తూ ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్:
రైతు విత్తనాల సమస్యపై పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనల ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. రైతులు అప్పులపాలు కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేస్తూ, రైతులకు విడుదల చేయవలసిన 610 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. విత్తనాల కొరత తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, రైతులు రోడ్డెక్కే పరిస్థితి రానివ్వకూడదని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసే చోట్ల విత్తనాలు దొరకడం లేదని, కానీ ప్రైవేటు గోదాముల్లో మాత్రం విత్తనాలు దొరుకుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించే విషయంలో ఆలస్యం చేయడం దురదృష్టకరం అని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రైతుల ప్రస్తుత సమస్యపై పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన ద్వారా స్పందించిన తీరు, అందులో లేవనెత్తిన అంశాలు సమంజసమైనవే నని ఆ ప్రకటనను చదివిన వారు అంటున్నారు.
కానీ … ఇది సరిపోదు!
అయితే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై సకాలంలో స్పందిస్తున్నప్పటికీ, ప్రజలలో బలమైన ముద్ర వేయాలంటే తన స్పందనను సోషల్ మీడియాలో ప్రకటనలుగా వెలువరించడం కంటే మించి మరింత చేయాలని అదే అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా, 2014 ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి మొదటి నెల కూడా పూర్తికాకముందే వై ఎస్ ఆర్ సి పి కొన్ని అంశాల మీద ధర్నాలు చేయడం, ప్రజా సమస్యలపై స్పందించడం వారు గుర్తు చేస్తున్నారు. సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఉన్నప్పటికీ కూడా వైఎస్సార్ సిపి నేతలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారని, పవన్ కళ్యాణ్ కేవలం సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పార్టీని బలంగా నిర్మించడానికి సరిపోవని, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు కేవలం కొద్ది శాతం మందికి మాత్రమే చేరతాయని, అదే రోడ్ల మీదకు వచ్చి సమస్యల గురించి మాట్లాడితే ప్రజలందరికీ పార్టీ వైఖరి అర్థం అవుతుందని వారు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఆశిస్తున్నది ఏంటి?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లో పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఆశిస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది, క్షేత్రస్థాయిలో మరిన్ని పోరాటాలు చేయడం. పవన్ కళ్యాణ్ గత ఏడాదిగా చేసిన ప్రజాపోరాట యాత్రలో అనేక సమస్యలు ప్రస్తావించినప్పటికీ ఆ పోరాటం మొత్తం కేవలం ఉపన్యాసాలు గా మాత్రమే కొనసాగింది. ఒక మాటలో చెప్పాలంటే గత ఏడాదిగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తానం లో ఉన్నదల్లా- ఉపన్యాసాలు, కవాతులు, సోషల్ మీడియా ప్రకటనలు. ఇవి కాకుండా వేరే రకమైన పోరాటాలు జనసేన పెద్దగా చేయ లేదు. రైతులతో మహారాష్ట్ర తరహాలో రాజధానిని ముట్టడిస్తాం, ప్రత్యేక హోదా కోసం అవసరమైతే దీక్ష చేస్తాం అని వ్యాఖ్యలు చేసినా, అవి కార్య రూపం దాల్చలేదు.
ఇక అభిమానులు ఆశిస్తున్న రెండవ అంశం, జనసేన పార్టీ వ్యవహారాలు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే బయటికి వస్తున్నాయి తప్ప ప్రధాన మీడియా లో చోటు సంపాదించుకోవడం లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ, జనసేన పార్టీ, మీడియా తో వ్యవహారశైలి ని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ ఒకరి మీద ఆధారపడకుండా, మీడియాతో వ్యవహరించడానికి సరైన టీంను ఏర్పాటు చేసుకోవడం, ఆ టీం మరింత ఎఫెక్టివ్ గా మీడియాతో వ్యవహరించడం, జనసేన నాయకులు తరచుగా మీడియాలో కనిపిస్తూ తమ వాణిని వినిపించడం- ఇలాంటివి చేయవలసి ఉందని తెలిసి అభిమానులు భావిస్తున్నారు.
మరి పవన్ కళ్యాణ్, తన పార్టీని ముందుకు నడిపించడంలో ఇటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటాడా అన్నది వేచి చూడాల్సిందే.