గడచిన కొద్దిరోజులుగా టీడీపీలోని కాపు సామాజిక వర్గం నేతలపై రకరకాల కథనాలు వస్తున్నాయి. వారంతా కాకినాడలో సమావేశం పెట్టుకోవడంతో… కీలక కాపు నేతలు తెలుగుదేశం పార్టీకి దూరం కాబోతున్నారనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. అందరూ భాజపాలో చేరతారనే కథనాలు తెరమీదికి వచ్చాయి. తోట త్రిమూర్తులు వెళ్లిపోతున్నారనీ, అదే బాటలో మరికొందరు కీలక నేతలు ఉన్నారనీ… ఇలా చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేశాయి. ఈ కథనాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కాపు నేతలు భేటీ అయ్యారు. దీంతో, కాపు నేతలను ఆయన బుజ్జగిస్తారు అనే ప్రచారం జరిగింది. అయితే, ఈ భేటీ అనంతరం కాపు నేతల స్పందన వేరేలా ఉంది!
కాకినాడలో తాము ఏయే అంశాలపై చర్చించుకున్నామో, అవన్నీ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు తోట త్రిమూర్తులు. పార్టీ ఓటమికి క్షేత్రస్థాయిలో తమకు ప్రధానంగా కనిపించిన కారణాలను ఆయనకు చెప్పామన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అందరమూ మరోసారి కలిసికట్టుగా పనిచేద్దామని చంద్రబాబు చెప్పారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నామన్నారు. తామంతా టీడీపీతోనే ఉన్నామనీ, ఎప్పటికీ ఉంటామని తోట త్రిమూర్తులు చెప్పారు. తమకు ఉన్న కొన్ని సమస్యలను కూడా చంద్రబాబుతో చర్చించామని చెప్పారు. అంతకుముందు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో కాపు నేతలకు పార్టీ నుంచి సరైన సహకారం అందలేదన్నారు! కాకినాడలో జరిగిన సమావేశం కూడా చంద్రబాబుకి ముందే చెప్పి నిర్వహించిందే అన్నారు. పార్టీ నుంచి బయటకి వెళ్తున్న నాయకుల గురించి చర్చించలేదన్నారు.
భాజపాలోకి కాపు నేతలు వెళ్లబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతం బ్రేక్ పడుతుందనే అనుకోవచ్చు. తామంతా టీడీపీతోనే ఉంటామని కాపు నేతలు ఇప్పుడు చెబుతున్నారు. అయితే, పార్టీలో కొంతమంది పెత్తనాన్ని తాము భరించలేకపోతున్నామనే అంశం కూడా చంద్రబాబుతో భేటీ సందర్భంగా కాపు నేతలు ప్రస్థావనకు తీసుకొచ్చినట్టు సమాచారం. పెత్తనం చేస్తున్న ఆ నేతలు ఎవరో మరి? అంటే, అంతర్గతంగా పార్టీలో కొన్ని సమస్యలున్నాయనేది చెప్పకనే చెబుతున్నారు. మరి, ఆ సమస్యలేంటో… పెత్తనం చేస్తున్నవారిని చంద్రబాబు ఎలా నియంత్రిస్తారో తేలాల్సి ఉంది.