భద్రతను తగ్గించటంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నక్సల్స్ నుంచి ఉన్న ముప్పు, గతంలో కల్పించిన భద్రత, జెడ్ ఫ్లస్ కేటగిరిలో ఉన్న తనకు, తన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తగ్గించిందని, వెంటనే భద్రతను పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా పిటిషన్లో కోరారు. సీఎంగా అధికార విధుల్లో ఉన్నప్పుడు.. శాంతిభద్రతలను కాపాడేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ఈ నేపథ్యంలోనే 2003లో తనపై తిరుపతికి సమీపంలోని అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ తో నక్సల్స్ దాడిచేసిన విషయాన్ని పిటిషన్ లో గుర్తుచేశారు. అప్పట్నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు, నివాసాలకు పూర్తిస్థాయి భద్రత కల్పించారని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016లో ఆంధ్రా-ఒడిషా బోర్డర్ జోన్ లో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో మళ్లీ నక్సల్స్ తనను టార్గెట్ గా చేసుకున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన జెడ్ కేటగిరిలో ఉన్నప్పటికీ, 7+7 భద్రతను కల్పించామని పిటిషన్ లో పొందుపరిచారు. అయితే ప్రస్తుతం తాను ప్రతిపక్ష నేతగా జెడ్ ఫ్లస్ కేటగిరిలో ఉన్నప్పటికీ కేవలం 2+2 మాత్రమే భద్రతను కల్పించటం, తన కుటుంబ సభ్యులకు భద్రతను ఉపసంహరించటంపట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నక్సల్స్ 2016లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా, 2018 సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును హతమార్చిన విషయాన్ని గుర్తుచేశారు. తన హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లను నిర్ధాక్షిణ్యంగా అణచివేశామని, ఈ స్మగ్లర్లు కూడా తనను టార్గెట్ చేశారని వివరించారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన దాడులతో కేంద్ర ప్రభుత్వం జెడ్ ఫ్లస్ కేటగిరిలో తనను చేర్చటంతోపాటు ఎన్.ఎస్.జి.భద్రతను సైతం కల్పించిందని వివరించారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తనకు భద్రతను పెంచాల్సిందిగా చంద్రబాబు తన పిటిషన్ లో కోరారు.
అయితే.. టీడీపీ అధినేత తన భద్రత కోసం హైకోర్టుకు వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. టీడీపీ క్యాడర్ దాడులతో సతమతమవుతోంది. వైసీపీ నేతలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ సమయంలో.. వారికి భద్రత, భరోసా కల్పిస్తామని.. టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అండగా ఉంటామని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు.. నేరుగా.. తన భద్రత కోసమే చంద్రబాబు… హైకోర్టుకు వెళ్లడంతో.. క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని.. చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వంపై పోరాటంలో.. ఇదో భాగమని.. టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు భద్రత విషయంతో.. రాజకీయ దాడులపై కూడా చర్చ జరుగుతుంది.. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు.