స్టార్ హీరోలు అందునా సూపర్ స్టార్లు, మెగాస్టార్లతో సినిమాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దర్శకుడు ఎవరైనా సరే – స్టార్ హీరోలకు తలొగ్గి పని చేయాల్సిందే. స్టార్లు ఏం చేసినా రైటు.. అంటూ సర్దుకుపోతుండాలి. సురేందర్ రెడ్డి లాంటి యువ దర్శకులైతే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే.. `సైరా` విషయంలో చిరంజీవి దగ్గర ధైర్యం చేశాడు సూరి. చిరుకి ఎదురు నిలిచి – చివరికి తన మాటే నెగ్గించుకున్నాడు.
`సైరా`కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా అయిపోయింది. అయితే ఓ చోట.. తనకు కావల్సినట్టుగా చిరు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదట. దాంతో ఆ ఒక్క షాట్‌ని మరోసారి రీషూట్ చేద్దామని చిరుని అడిగాడట. ముందు చిరంజీవి రీషూట్‌కి అస్సలు ఒప్పుకోలేదని, `సెట్లో చూసుకోకపోతే ఎలా..?` అని గట్టిగా మందలించాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. సూరి పంతం పట్టి, రామ్‌చరణ్‌తో చెప్పించి, ఒప్పించి, చివరికి చిరుని రీ షూట్‌కి రెడీ చేయించాడట. ఈసారి మాత్రం షాట్ తనకు కావల్సినట్టుగా వచ్చేంత వరకూ తీస్తూనే ఉన్నాడని, సూరి డెడికేషన్ చూసి చిరంజీవి కూడా ముగ్థుడయ్యాని ఈ సినిమాకి పనిచేసిన ఓ సాంకేతిక నిపుణుడు చెప్పుకొచ్చాడు. సినిమా మొత్తం పూర్తయ్యాక.. చిరుతో రీషూట్ చేయించిన దర్శకుడు సూరీనే అని, ఈ విషయాన్ని కూడా చిరంజీవి సెట్లో గుర్తు చేశారని సమాచారం. మొత్తానికి సూరి మరోసారి తన మొండితనాన్ని చాటుకున్నాడు. అదీ.. మెగాస్టార్ దగ్గర.