తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ సారి పదవి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల ఇరవై ఆరో తేదీ తర్వాత ఎప్పుడైనా ఆయనను తొలగిస్తూ.. అదే సమయంలో.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమిస్తూ.. ఆదేశాలు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున అధికారిక ప్రకటన మాత్రం… సమావేశాలు ముగిసిన తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు. ఈ నెల ఇరవై ఆరో తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి.
నరసింహన్‌కు ఇక గవర్నర్ పదవి లేనట్లే..!
కేంద్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసి.. ఆనాటి కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్న నరసింహన్… వెంటనే… గవర్నర్ పదవి పొందారు. మొదట చత్తీస్ ఘడ్కు.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు… ఇన్చార్జ్గా వచ్చినప్పటికీ.. ఇక్కడే స్థిరపడిపోయారు. పదేళ్లకుపైగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు… తెలుగు రాష్ట్రాలకు.. సంయుక్తంగా గవర్నర్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఏ గవర్నర్ కూడా.. ఇంత కాలం పదవిలో ఉన్న సందర్భం దేశంలో లేదు. అయితే.. ఆయనను ఈ సారి తప్పిస్తున్న కేంద్రం.. గవర్నర్‌గా మాత్రం మరో రాష్ట్రానికి నియమించే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. జమ్మూకశ్మీర్ వ్యవహారాలపై ఆయనను సలహాదారుగా నియమించుకుంటారని చెబుతున్నారు.
రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు..!
తెలుగురాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. విభజన వివాదాలు దాదాపు పరిష్కరం అయ్యాయనే భావన అని పైకి చెబుతున్నప్పటికీ.. అసలు విషయం మాత్రం వేరే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనుకుంటున్న బీజేపీ.. తమ రాజకీయ వ్యూహాలకు తగ్గట్లుగా వ్యవహరించే గవర్నర్లను.. నియమిచాలని నిర్ణయించుకుంది. నరసింహన్… టీఆర్ఎస్తో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూండటంతో.. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఆయనను కోరుకోవడం లేదు. విచిత్రంగా ఏపీ బీజేపీ నేతలు కూడా.. ఆయనను.. ఏపీకి కూడా అవసరం లేదని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలెవరికీ ఇష్టం లేకపోవడం… పలువురు సీనియర్లకు.. చాన్సులు ఇవ్వాల్సి ఉండటంతో.. బీజేపీ కొత్త గవర్నర్ల వైపు మొగ్గినట్లు తెలుస్తోంది.
సుష్మాస్వరాజ్ ఖాయమేనా…?
కొద్ది రోజుల కిందట.. సుష్మాస్వరాజ్‌ను ఏపీ గవర్నర్‌గా నియమించబోతున్నట్లుగా.. కేంద్రమంత్రి హర్షవర్ధన్ .. ట్వీట్టర్లో ప్రకటించి.. వెంటనే డిలీట్ చేశారు. అదికారిక ప్రకటన ఆలస్యం అవుతుందన్న కారణంగా.. అలా చేసనట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ అలాంటి ప్రకటన ఈ నెలాఖరులో రావొచ్చంటున్నారు. సుష్మాస్వరాజ్ గవర్నర్ అయితే.. ఏపీలో .. తాము బలపడటానికి కావాల్సిన వ్యూహాలను అమలు చేయవచ్చని భావిస్తున్నారు. తెలంగాణపై ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టినందున… మరో సీనియర్ నేతనే రంగంలోకి దింపుతారని అంటున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేరు వినిపిస్తోంది. ఎవరెవరు అనేది నెలాఖరులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.