అక్కినేని కుటుంబం అంతా ఒకే సినిమాలో కలసి సందడి చేశారు. అదే… ‘మనం’. ఏఎన్నార్ ఆఖరి చిత్రం కూడా అదే కావడంతో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇలా కుటుంబ సభ్యులంతా కలసి ఓ సినిమాలో నటించడం అరుదైన విషయంగా రికార్డుకెక్కింది. ఇప్పడు రాజశేఖర్‌కీ అదే ఆలోచన వచ్చింది. జీవిత, రాజశేఖర్ ఇద్దరూ నటులే. ఇద్దరూ జంటగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆ తరవాత.. జీవిత సినిమాలకు దూరమైంది. రాజశేఖర్ మాత్రం హీరోగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఇంట్లోంచి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు. వాళ్లే శివానీ, శివాత్మిక. ఇప్పుడు ఈ నలుగురూ కలసి ఓ సినిమాలో నటించబోతున్నారు. కథ కూడా సిద్ధమైంది. సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. దర్శకుడు ఎవరన్నది త్వరలో తెలుస్తోంది. ఇటీవలే రాజశేఖర్ నటించిన ‘కల్కి’ విడుదలైంది. ప్రస్తుతం `గరుడవేగ 2` సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే రాజశేఖర్ ‘మనం’ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.