బీజేపీ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఓటుబ్యాంకు లేకపోయినప్పటికీ ఆ పార్టీని అభిమానించే వారు దేశ వ్యాప్తంగా ఉన్నారు. ప్రత్యేకించి హిందూ మతాన్ని అభిమానించే వారిలో బీజేపీ పార్టీ అంటే విలువలు గల పార్టీ అని, క్రమశిక్షణ గల పార్టీ అని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అటువంటి సదాభిప్రాయాలకు తూట్లు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎటువంటి వారు వచ్చినా, వారికి ఎలాంటి నేపథ్యం ఉన్నా, బీజేపీ పెద్దలు వారికి కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడమే ఇందుకు కారణం.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ – లక్ష్మీ పార్వతి తనను లైంగిక వేధింపులకు గురి చేసిందంటూ ఆ మధ్య ఫిర్యాదు చేసిన కోటి అనే వ్యక్తిని కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే ఈయనే కుట్రపూరితంగా తన పేరు చెడగొట్టడానికి ఇలా చేస్తున్నాడు అంటూ లక్ష్మి పార్వతి ఆ సంఘటనపై స్పందించింది. సినీనటి పూనంకౌర్ కూడా గతంలో ఈయన మీద ఇలాంటి ఫిర్యాదే చేసి ఉంది. ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంపై సామాన్య ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో ఉంది కాబట్టి ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరి ఉంటాడని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటివారిని చేర్చుకోవడం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని బీజేపీ అభిమానులు అంటున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళ మీద ఎథిక్స్ కమిటీకి లేఖలు రాసిన బీజేపీ పెద్దలు ఆ తర్వాత ఏమాత్రం మొహమాట పడకుండా వారిని పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి.
ఇక రెండు రాష్ట్రాల్లోనూ బలపడడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ, తన పార్టీ తలుపులు బార్లా తెరిచి ఉంచింది. ఏ పార్టీకి చెందిన ఎవరు వచ్చినా, చేర్చుకోవడానికి సిద్ధమే అని సంకేతాలు పంపుతోంది. అయితే బీజేపీ ని మొదటి నుండి అభిమానిస్తున్న వారికి ప్రస్తుత పరిణామాలు మింగుడుపడడం లేదు. మొన్న మొన్నటి దాకా విలువలతో కూడిన పార్టీ బీజేపీ అని తాము భావించామని కానీ ఇప్పుడు బీజేపీ కూడా శతకోటి పార్టీలలో తాను కూడా ఒకటిగా మారిపోయింది అని వారంటున్నారు.