గడచిన రెండ్రోజులుగా తెరాసలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది! నిజామాబాద్ ఎంపీ సీటును తెరాస కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కుమార్తె కవితను సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు అరవింద్ ఓడించారు కదా! అయితే, డీ శ్రీనివాస్ ప్రస్తుతం భాజపాలో చేరలేదు, అలాగని తెరాసలో ఉన్నారా అంటే… సాంకేతికంగా ఉన్నట్టుగానే! తెరాస వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే… డీఎస్ పై పార్టీ ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా అనేది?
ఎన్నికలకు ముందు, డీఎస్ మీద చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ తెరాస నేతలు తీర్మానించారు. అప్పటి ఎంపీ కవిత సమక్షంలోనే ఈ తీర్మానాన్ని పార్టీ అధినాయకత్వానికి అందజేశారు. అప్పుడే డీఎస్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అయితే, తెరాస నుంచి ఎలాంటి చర్యలు అంటూ లేవు. నిజామాబాద్ జిల్లా తెరాస నేతలంతా ఏకగ్రీవంగా డీఎస్ మీద ఫిర్యాదు చేసినా, సీఎం కేసీఆర్ చర్యలకు దిగలేదు. ఆ తరువాత, ఎన్నికలొచ్చాయి. డీఎస్ కుమారుడు అరవింద్ భాజపా ఎంపీగా గెలిచారు. రెండ్రోజుల క్రితం జిల్లాలో జరిగిన ఓ సభలో డీఎస్ కూడా కుమారుడితో కలిసి వేదికను పంచుకున్నారు. అంతేకాదు, రైతులతో పెట్టుకుంటే ఎవ్వరికైనా ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించడం విశేషం! అంటే, పరోక్షంగా తెరాస మీదే కదా ఆయన పంచ్ వేసినట్టే.
డీఎస్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెరాస అధినాయకత్వం ఇప్పుడైనా చర్యలు తీసుకుంటుందా అనే చర్చ అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుని ఉన్న డీఎస్ మీద ఛైర్మన్ కి ఫిర్యాదు చేసి, సభ్యత్వ రద్దుకి తెరాస ప్రయత్నించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, తెరాస ఇలాంటి చర్యలకు దిగితే… పరోక్షంగా భాజపా నుంచి మద్దతు లభించే అవకాశమూ లేకపోలేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వంపై తెరాస ఫిర్యాదు చేసినా, నిర్ణయం తీసుకోవాల్సింది ఛైర్మన్ కదా! ఇంకోటి రాజ్యసభలో భాజపాకి అనుకూలంగా డీఎస్ వ్యవహరించే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. అదే పని చేస్తే ఆ పార్టీకి మరో నంబర్ తోడైనట్టే అవుతుంది. ప్రాక్టికల్ గా ఇలాంటి పరిణామాలకు ఆస్కారం ఉంది కాబట్టి, డీఎస్ విషయంలో చూసీ చూడనట్టుగా తెరాస వ్యవహరిస్తుందేమో అనే సూచనలూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చర్యలంటూ మళ్లీ చర్చ పెడితే, తెలంగాణ సీఎం కుమార్తె ఓటమిని పరోక్షంగా మరోసారి జాతీయ స్థాయిలో అందరికీ గుర్తుచేసినట్టు అవుతుందనే అభిప్రాయమూ తెరాసకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సో.. ప్రస్తుతం తెరాస తీరుపై డీఎస్ నేరుగా విమర్శించినా కూడా తెరాస నుంచి అనూహ్య చర్యలు ఉండే అవకాశం తక్కువగా ఉందనే వాదన కూడా బలంగా ఉంది.