తెలంగాణలో చేరికల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే పనిలో భాజపా దూకుడుగా ఉంది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతల్ని పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. ఈ వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తే, తెలంగాణలో షా ప్రారంభిస్తారు. అయితే, ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకుల్ని భాజపాలో చేర్చాలని రాష్ట్ర నేతలు ఉత్సాహపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొత్తగా చేరిన నేతలకు పార్టీ అధినాయకత్వమే కొన్ని టార్గెట్లు పెట్టిందని సమాచారం. భాజపాలో చేరిన ప్రతీ నాయకుడూ… వారు గతంలో ఉన్న పార్టీ నుంచి కొద్దిమంది నేతలైనా సంప్రదించాలనీ, భాజపాలోకి వచ్చే విధంగా వారిని ప్రోత్సాహించాలనే లక్ష్యం పెట్టిందట! అందుకే, తాజాగా కమలం పార్టీలో చేరిన నేతలు చాలా హడావుడిగా ఉంటున్నారు.
ఆ మధ్య పార్టీలో చేరిన డీకే అరుణ, ప్రస్తుతం భాజపాలోకి నేతల్ని చేర్చే పనిలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. గతవారంలో రాం మాధవ్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ కి చెందిన కొంతమంది నాయకులను ఆమె స్వయంగా దగ్గరుండి ఆయనకి పరిచయం చేశారనీ, అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. టి. తెలుగుదేశం నేత పెద్దిరెడ్డి కూడా భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కూడా తెలంగాణ టీడీపీలో ఇంకా మిగిలి ఉన్న కొద్దిమంది నేతలతోపాటు, జిల్లా, మండల స్థాయిలో కీలకంగా ఉన్న టీడీపీ నేతల్ని భాజపాలోకి తీసుకొచ్చే పనిలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. మరో నేత గరికపాటి కూడా తన సన్నిహితులను భాజపాలో ఆహ్వానించే పనిలో పడ్డారట.
భాజపాలో చేరిన నేతలంతా కొత్తవారిని ఆకర్షించే పనిలో నిమగ్నమై ఉన్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్న పరిస్థితి. ఓరకంగా ఇది పార్టీలో కొత్త నాయకుల స్థాయిని పెంచుకునే కార్యక్రమంగానూ చూడొచ్చు. ఎవరైతే ఎక్కువమంది నాయకుల్ని, పెద్ద సంఖ్యలో కేడర్ ని భాజపాకి తీసుకొస్తారో… వారిని జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేకంగా గుర్తించే అవకాశం ఉంటుంది! కాబట్టి, ఓరకంగా కొత్త నేతలు దీన్నొక మంచి అవకాశంగా భావించి, బాగానే కష్టపడుతున్నారని చెప్పొచ్చు.