కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న బీజేపీ… ముహుర్తాన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత ఖరారు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే.. కర్ణాటకలో రోజువారీ కాంగ్రెస్ వ్యవహారాలు ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేసేలా సాగుతున్నాయి. కుమారస్వామి సర్కార్ పరిస్థితి దినదినగండం అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్, ఆనంద్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేస్తూ ఆ పత్రాలను స్పీకర్ కు పంపించారు. వీరిద్దరూ రాజీనామా చేస్తే.. ప్రభుత్వం పడిపోదు. నిలబడే ఉంటుంది.
కానీ.. మరో .. ఒకరో .. ఇద్దరో అటో.. ఇటో అయితే మాత్రం.. తేడా వస్తుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడానికి బీజేపీ అగ్రనేతలు.. ఒప్పందాలు చేసుకున్నారు. ఒకటి, రెండు రోజులలో వీరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీనిపై సిద్దరాయమ్య నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీ అత్యవసర భేటీ జరిగింది. సంక్షోభం నుంచి బైటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో టచ్లోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఫలించలేదు ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం కుమారస్వామి కూడా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి రాజీనామాను ఉపసంహరించే దిశగా ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
మరో పక్క బీజేపీ కూడా తొందరపడ దలచుకోలేదని చెప్పుకుంటోంది. ఎవరినీ ఆహ్వానించే ప్రసక్తే లేదని, వస్తే మాత్రం చేర్చుకుంటామని బీజేపీ నేత అయిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. కానీ అసలు ఆపరేషన్ మాత్రం.. వేరేగా ఉంది. కర్ణాటక రాజకీయాలను శాసించేందుకు హైకమాండ్ ఓ ముఖ్యనేతను బెంగళూరుకు పంపింది. ఆయనే కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరపబోతున్నారు. బయటకు.. ఏదేదో చెబుతున్నా… కాంగ్రెస్లో వచ్చిన చీలికను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత వారంలో ప్రభుత్వాన్ని మార్చాలని.. బీజేపీ పట్టుదలగా ఉందంటున్నారు.