సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేస్తే.. మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్… కూడా.. పరాజయం పాలవ్వడం.. అంతకు మించి షాక్‌గా.. మారింది. మంగళగిరి రాజధాని ప్రాంతం కావడం.. చంద్రబాబు తనయుడిగా.. లోకేష్‌కు.. ఉండే ఆకర్షణతో.. సునాయాసంగా ఆయన విజయం సాధిస్తారని అనుకున్నారు. పైగా.. గత ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ కేవలం 14 ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో.. గెలుపు ఖాయమనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చే సరికి.. గెలుపు ఆశలన్నీ తేలిపోయాయి. ఆ తర్వాత లోకేష్ ఎందుకు ఓడిపోయారన్నదానిపై.. అనేక మంది అనేక విశ్లేషణలు చేశారు.
అయితే లోకేష్ మాత్రం.. తాను ఎందుకు ఓడిపోయానో.. ఇప్పటికి ఓ క్లారిటీకి వచ్చారు. మంగళగిరి ప్రజలను కలుసుకునే సమయం లేకపోవడం వల్లేనే తాను.. ఓడిపోయానని.. విశ్లేషించుకున్నారు. రోడ్లు, విద్య, వైద్యం వంటి విషయాల్లో బాగా అభివృద్ధి చేసిన చోట కూడా ఓటమి పాలయ్యామని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో.. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా వచ్చిన ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఐటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇపుడు వెనకడుగు వేస్తున్నాయని మీడియా ప్రతినిధులతో ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల గురించే జగన్ చెబుతున్నారని.. పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల అమలు సంగతేంటని ప్రశ్నించారు.
లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. టీడీపీ అధినేత .. త్వరగా సీటు ఖరారు చేయలేకపోయారు. మొదట కుప్పం పేరు చెప్పారు.. చంద్రబాబే సీటు మారుతారన్నారు. తర్వాత హిందూపురం అన్నారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల పేర్లు వచ్చాయి. నామినేషన్లకు ముందు భీమిలి నియోజకవర్గమన్నారు.. ఆ తర్వాత విశాఖ నార్త్ అన్నారు.. చివరికి మంగళగిరితో సరిపెట్టుకున్నారు. ఇంత గందరగోళం మధ్య.. లోకేష్.. సరైన విధంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. ఫలితంగా ఓటమి పాలయ్యారు. అదే విషయాన్ని లోకేష్ చెప్పారు. అంటే.. ఓ రకంగా.. లోకేష్ ఓటమికి.. చంద్రబాబే కారణం అన్నమాట..!