రౌడీయిజం చేస్తామంటే ప్రజలు ఓటెయ్యలేదనీ, మంచి చేస్తామని చెప్తేనే ప్రజలు మీకు ఓట్లేశారని అధికార పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కుప్పంలో ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలుంటాయనీ, కక్ష సాధింపు ధోరణులు ఉండకూడదన్నారు. జిల్లాలవారీగా మన వారు పడుతున్న కష్టనష్టాలను సమగ్రంగా తెలుసుకోవడం కోసం 13 టీమ్ లను వేశానన్నారు. పడుతున్న ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. మనవాళ్ల మీద దాడులు ఇంకా ఇంకా కొనసాగితే, అక్కడి పరిస్థితులు చక్కదిద్దేవారకూ ఆయా ఊళ్లలో తాను వచ్చి బస చేస్తానన్నారు.
విభజన తరువాత రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంటే, అభివృద్ధి చేయడం కోసం కృషి చేశానన్నారు చంద్రబాబు నాయుడు. ఎవ్వరికీ ఇబ్బందుల్లేకుండా పెన్షన్లు, పెళ్లి కానుక, బీమా, పిల్లల్ని చదివించడం, రేషన్… ఇలా చాలా చేశామన్నారు. రాజధానిని నిర్మిస్తామని పిలుపునిస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారన్నారు. నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టామన్నారు. తాను ఎప్పుడూ రాగద్వేషాలకు పోలేదనీ, మనకు వ్యతిరేకం అని పులివెందులకు నీరు ఇవ్వకుండా ఉండలేదన్నారు. పరిశ్రమల కోసం ప్రపంచమంతా తిరగా అన్నారు. ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కాలేదన్నారు. చేయరాని తప్పులు తానేమైనా చేశానా అని ప్రశ్నించారు. మనం చేసిన పనులన్నీ కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. అయితే, రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తాననీ, సమస్యలపై మరింత తీవ్రంగా పోరాటం చేస్తాననీ, కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత తనదన్నారు.
ప్రజలు ఏవిధంగా ఆలోచించారో అర్థం కావడం లేదన్న చర్చ ఇంకా అనవసరం కదా! ఇప్పుడు టీడీపీ పూర్తిస్థాయి ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాలి. పార్టీ ఓటమికి కారణాలపై చర్చించుకున్నా… అవి కేవలం అంతర్గత వ్యవహారాలుగా మాత్రమే ఉండాలి. అంతేగానీ, ప్రజా వేదికలపై ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం వల్ల మరిన్ని విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్టే అవుతుంది. ప్రజల సమస్యలను గుర్తించాలి, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటున్నారు, ఆ అంశంపై పోరాడాలి, గత పాలనపై విచారణ అని ప్రభుత్వం ఉప సంఘం వేసింది… ఇలా చాలా అంశాలు ప్రతిపక్ష పార్టీ ముందుకు వస్తున్నాయి. ఇక టీడీపీ కార్యాచరణ అటువైపు మారిపోవాలి. ఇంకా, ఓటమి షాక్ నుంచి బయటకి రానట్టుగా వ్యవహరిస్తుంటే… పార్టీ శ్రేణులు కూడా అదే మైండ్ సెట్ లో నిరుత్సాహంలో కొనసాగుతాయి కదా!