రాహుల్ గాంధీ ఫైనల్‌గా చెప్పేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేది లేదని తేల్చేశారు. అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేస్తూ ఆయన ట్వీటర్‌లో ఒక సందేశం ఉంచారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి అందరూ బాధ్యత వహించాల్సిందేనంటూ తన బాధ్యత కూడా ఉన్నందున రాజీనామా చేస్తున్నానన్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. జవాబుదారీ తనం వస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ఇక ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా కూడా బీజేపీ, ఆరెస్సెస్‌పై పోరాటం సాగిస్తున్నానని ఆయన వెల్లడించారు. తాను ఇతరుల రాజీనామా కోరడం లేదని, అది వాళ్లిష్టమని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుగడిగా 90 ఏళ్ల మోతీలాల్ వోరాను నియమించారు.
రాజీనామా లేఖలో రాహుల్‌గాంధీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యుడినని ప్రకటించుకున్నారు. అందుకే రాజీనామా చేశా..కాంగ్రెస్‌లో మార్పులు అవసరమని స్పష్టం చేసారు. పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిలా పనిచేస్తా .. కొత్త అధ్యక్షుడి ఎన్నికకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీతో శతృత్వం లేదు..కోపం లేదుని కానీ .. బీజేపీ విధానాలకు నేను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో లౌకికతత్వం లేదని లేఖలో స్పష్టం చేశారు. దేశాన్ని ఆర్‌ఎస్‌ఎస్ పాలిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఒక పార్టీతో తలపడలేదు..ఓ వ్యవస్థను ఢీకొట్టామని… అన్ని వ్యవస్థలు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేశాయన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరపాల్సిన అవసరం ఉందని… వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
రాహుల్ సోమవారం కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. మేథోమథనం సాగించారు. రాహుల్ నాయకత్వంపై సీఎంలంతా విశ్వాసం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగాలని ఆకాంక్షించారు. అయితే తన నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని రాహుల్ బుధవారం ప్రకటించారు. వీలైనంత త్వరగా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించుకోవాలని ఆయన సూచించారు.