కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా అంటూ ఏదీ లేదని తేలిపోయింది. ఎన్నికల అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకుంటానని ప్రకటించడం, ఆయనే కొనసాగలంటూ పార్టీలో నాయకులు డిమాండ్ చేస్తుండటం, ఆయన నాయకత్వమే అవసరమంటూ పార్టీ పదవులకు రాజీనామా… ఇవన్నీ చూశాక, చిట్ట చివరికి రాహుల్ వినా కాంగ్రెస్ కి మరో మార్గాంతరం లేదనే పరిస్థితిని తీసుకొచ్చే వ్యూహంగా కనిపించింది! కానీ, అలాంటిది ఏదీ లేదని రాహుల్ గాంధీ తాజా ప్రకటనతో స్పష్టమైంది. ఓరకంగా ఇచ్చి మెచ్చుకోదగ్గ పరిణామమే అనాలి. ఎందుకంటే, ఎన్నికల్లో ఓటమికి అధినాయకుడిగా తనదే పూర్తి బాధ్యత అని చెబుతూ, వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకోవడంలో హుందాతనం ప్రదర్శించారనీ అనొచ్చు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాలేదు.
రాహుల్ గాంధీ తప్పుకోవడం వల్ల కాంగ్రెస్ కి పార్టీకి నిజంగా లాభం కలుగుతుందా అంటే… కొంత ఉందనే అనిపిస్తోంది. ఎలా అంటే, కాంగ్రెస్ అంటే కుటుంబ పార్టీ అంటూ భాజపా పెద్ద ఎత్తున ప్రచారం చేసి బాగానే లబ్ధి పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా… ఇలా ఆ పార్టీకి చెందిన నేతలంతా కాంగ్రెస్ ను ఒక కుటుంబ పార్టీగానే ప్రజల్లోకి తీసుకెళ్లారు. గాంధీ కుటుంబానికి మాత్రమే అక్కడ అవకాశాలనీ, వారసత్వ రాజకీయాలే అని ప్రచారం చేయడంలో ఓరకంగా విజయం సాధించారు. చివరికి, ఆ ముద్ర నుంచి కాంగ్రెస్ బయటపడితే తప్ప, భాజపాకి ధీటుగా కనిపించదేమో అనే ఒక స్థాయి అభిప్రాయాన్ని క్రియేట్ చేయడంలోనూ విజయం సాధించారని చెప్పొచ్చు. రాహుల్ తాజా నిర్ణయం పార్టీపైన ఆ కుటుంబ ముద్రను చెరిపేయడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అయితే, భవిష్యత్తులో ప్రియాంకా గాంధీని కీలకం చేసే ప్రయత్నం మొదలైతే… మళ్లీ అదే పాత కథ పునరావృతం అవుతుంది.
వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకి కూడా తాజా నిర్ణయంతో కొంత మంచి పేరే వచ్చే అవకాశమూ ఉందనే చెప్పుకోవాలి. అయితే, ఇదే సమయంలో… పార్టీ ఓడిపోయాక బలంగా నిలబడి మరోసారి పోరాటం చేయలేకపోయారనే విమర్శలూ రాహుల్ మీద ఇప్పటికే వినిపిస్తున్నాయి. అది రొటీన్ గా తప్పదు. రాహుల్ కూడా తాను పోరాటం చెయ్యను అని ఎక్కడా చెప్పలేదు. వ్యక్తిగతంగా భాజపా మీద పోరాటం కొనసాగిస్తాననే చెబుతున్నారు. అయితే, రాహుల్ తాజా నిర్ణయం ఓటమి భారంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు ఓరకంగా ఉపశమనంగానూ చెప్పొచ్చు! ఓటమికి తమ నాయకుడు బాధ్యత వహించారనీ, పార్టీ అధ్యక్ష పదవినే త్యాగం చేశారనే కోణంలో కార్యకర్తలకు చెప్పుకునే అవకాశం ఉంది.