ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. పోలీసుల స్కిట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం నియమించిన సిట్‌ను.. తీసేసి.. కొత్తగా సిట్‌ను నియమించిన ప్రభుత్వం… ఆ తర్వాత చకచకా దర్యాప్తు కొనసాగేలా చూస్తోంది. ఈ క్రమంలో నిందితులపై.. చార్జిషీటు దాఖలు చేయలేదన్న కారణంగా… కోర్టు వారికి బెయిలిచ్చింది. వారు పులివెందులలో రోజువారీ రాజకీయాలు చేసుకుంటున్నారు. గతంలో.. అనుమానితులుగా ఉన్న వారు.. ప్రశ్నించిన వారు.. అందరూ.. దాదాపుగా కేసు నుంచి బయటపడ్డారు. అయితే.. ఇప్పుడు కొత్తగా పోలీసులు… వంట మనిషి రంగయ్యను.. తెరమీదకు తెచ్చారు. ఆయనకు నార్కో పరీక్షలంటూ హడావుడి ప్రారంభించారు.
“సాక్షి”కి నార్కో పరీక్షలు..! ఏపీలో మాత్రమే సాధ్యం..!
వంట మనిషి రంగయ్యకు..ఈ ఘటనతో ఎలాంటి సంబందం లేదు. పోలీసులు ఇప్పటి వరకూ.. ఎలాంటి.. విచారణలోనూ..ఆయన పేరు ప్రస్తావించలేదు. కేవలం.. వివేకా వంట మనిషి కాబట్టి… కొన్ని ప్రశ్నలు అడిగి ఉంటారు. కానీ.. ఇప్పుడు.. ఆయనకు.. నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ.. ఒక్క సారిగా.. ఎవరికీ తెలియకుండా కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు పర్మిషన్ తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా… రంగయ్యను హైదరాబాద్‌కు తరలించారు. నార్కో పరీక్షలు నిర్వహించి.. నిజాన్ని నిగ్గు తేలుస్తామని… చెబుతున్నారు.
నిందితులకు “నార్కో” ఎందుకు చేయరు..?
నిజానికి చాలా మర్డర్ కేసులకన్నా.. వివేకా మర్డర్ కేసు చేధించడం పోలీసులకు చాలా సులువు. చాలా చిన్న క్లూతోనే.. ఎన్నో మర్డర్ కేసులు వీడిపోయాయి. కానీ.. వివేకా మర్డర్ కేసులో దొరికిన ఆధారాలు.. సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేయడం వంటి ఘటనలు జరిగిన తర్వాత.. ఆ కేసును పోలీసులు తల్చుకుంటే.. గంటల్లోనే చేధించగలరు. కానీ రాజకీయ కారణాలతోనే.. నాన్చుతున్నారని చెబుతున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి. వారు అలా ఎందుకు చేశారో.. నార్కో పరీక్షలు నిర్వహిస్తే.. మొత్తం గుట్టుబయటపడిపోతుంది. అలా కాకుండా.. రంగయ్యను నార్కో పరీక్షలకు ఒప్పించడం… ఏమిటో.. న్యాయనిపుణులకు కూడా అర్థం కావడం లేదు.
కేసును వీలైనంత త్వరగా తేల్చాలనుకుంటున్నారా..?
వివేకానందరెడ్డి హత్య కేసును.. సిట్ దర్యాప్తు బృందం వీలైనంత త్వరగా ఓ కొలిక్కి తేవాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ “కొలిక్కి” అనేది ఎటు వైపు ఉంటుందో చెప్పడం కష్టమని అంటున్నారు. ఇప్పటి వరకూ.. ఉన్న ఆధారాలతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దర్యాప్తు టీం కూడా మారింది. అంతకు మించి రాజకీయం కూడా మారిపోయింది. ఈ క్రమంలో… ఆయన కేసును.. ఎటూ తేల్చకుండా.. కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే రంగయ్యకు నార్కో పరీక్షలని చెబుతున్నారు. రంగయ్యే నిందితుడా అన్న చర్చ కూడా.. పులివెందులలో ఇప్పుడు జరుగుతోంది.