కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి లు రెండూ, అధికారికంగా పొత్తు లేకపోయినప్పటికీ, ఎన్నికలకు ముందు మిత్రపక్షాల వలె వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నాయకుల తీరు చూస్తుంటే అయితే వైఎస్సార్ సీపీలోకి లేదంటే బిజెపిలోకి చేరిపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకరు వైఎస్సార్సీపీలో మరొకరు బిజెపిలో చేరుతూ ఉండడంతో ఇది ఒక కుటుంబ కథా చిత్రాన్ని తలపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం పాటు కొనసాగిన అంబికా కృష్ణ ఈ మధ్య బిజెపిలో చేరి పోయారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు ఏమీ లోటు చేయనప్పటికీ, మారిన పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీద నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆయన బీజేపీ లోకి వెళ్లారని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడమే కాకుండా బాలకృష్ణ తో కూడా పలు సినిమాలు నిర్మించి ఉండడంతో తెలుగుదేశం పార్టీ అభిమానుల లో కూడా ఆయన అంటే అభిమానం ఉండేది. కానీ ఏది ఏమైతేనేం ఆయన మొత్తానికి బిజెపిలో చేరి పోయారు. అయితే ఇప్పుడు ఆయన సోదరుడు అంబికా రాజా మాత్రం వైఎస్ఆర్సీపీలో చేరారు. మొత్తానికి సోదరులు ఇద్దరూ ఒకరు బిజెపిలో మరొకరు వైఎస్ఆర్సీపీలో చేరారు.
అయితే ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఒకరు బిజెపిలో మరొకరు వైఎస్ఆర్సిపిలో చేరే ట్రెండ్ ఈమధ్య బాగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు బిజెపి నేత పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, వారి కుమారుడు వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ కేవలం పెద్ద నేతలకు పరిమితం కాలేదు. ఎన్నికలయ్యాక చాలా మంది స్థానిక నేతలు, చోటామోటా నేతలు కూడా ఒకరు వైఎస్ఆర్సీపీలో చేరితే అదే కుటుంబానికి చెందిన మరొకరు బిజెపిలో చేరుతున్నారు. చాలా చోట్ల ఇదే సీన్ కనిపిస్తూ ఉండటంతో రాష్ట్రంలో ఇది ఒక కుటుంబ కథా చిత్రాన్ని తలపిస్తోంది.
మరి ఈ కుటుంబ కథా చిత్ర ట్రెండ్ ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి