జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున శతఘ్ని టీమ్ ఇటీవల పార్టీ కోసం విరాళాలు సేకరించడానికి, కేవలం 100 రూపాయలు విరాళంగా ఇవ్వమని ఒక ప్రకటన చేసింది. అయితే ఆ ప్రకటన అనంతరం పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా తమ శాయశక్తులా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ సోషల్ మీడియాలో ఇంతలోనే ఈ విరాళాల సేకరణ మీద ఇతర పార్టీల అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. జనసేన అభిమానులు మాత్రం ఆ విమర్శలను ధీటుగా తిప్పి కొడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుండి కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు తమకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తే భారీ విరాళాలు ఇవ్వడానికి సిద్ధమేనంటూ ముందుకు వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ తాను అనుకున్న శైలిలో రాజకీయాలు చేయడానికి ఇటువంటి వారు అడ్డంకి అవుతారని భావించి ఆ విరాళాలు తిరస్కరించారు. అయితే ఎన్నికలు ముగిశాక పార్టీ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. మిగిలిన కొన్ని పార్టీల లాగా సభలకు జన సమీకరణకు మనిషి మనిషికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, ఇతరత్రా రాజకీయ వ్యవహారాలు నడపడానికి కచ్చితంగా డబ్బు అవసరం. అయినప్పటికీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ బడా పారిశ్రామికవేత్తల మీద ఆధారపడకుండా, వారి చేతుల్లో కీలు బొమ్మ కాకుండా, కేవలం తన అభిమానుల మీద, చిన్న చిన్న విరాళాల మీద ఆధారపడుతున్నారు. రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది సత్సాంప్రదాయమే. కానీ ఇతర పార్టీల అభిమానులు మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ లో తిరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రజలని విరాళాలు అడగడాన్ని దెప్పి పొడుస్తున్నారు. మరికొందరైతే తమ పార్టీ అధినేత, ప్రజల నుండి విరాళాలు అడగకుండా, ఏడేళ్లుగా పార్టీ ని విజయవంతం నడిపించాడని, అలా చేయలేనప్పుడు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ మూసేసుకుంటే మంచిదని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
అయితే జనసేన అభిమానులు మాత్రం ఈ విమర్శలను బలంగా తిప్పి కొడుతున్నారు. మీ పార్టీ అధినేత లాగా ప్రజల డబ్బును పవన్ కళ్యాణ్ దోచుకోలేదని, కాబట్టి ఇలాంటి విరాళాలు తీసుకోవడంలో తప్పు లేదని వారంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ గా ఉన్నప్పుడు, సినిమాలు రాజకీయాలు రెండూ సమాంతరంగా చేస్తూ ఉన్నప్పుడు స్పెషల్ ఫైట్ లో తిరిగే సామర్థ్యం ఆయనకు ఉండేదని, దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదని వారు కౌంటర్స్ ఇస్తున్నారు. మిగతా పార్టీల లా బడా పారిశ్రామికవేత్తల మీద ఆధారపడి, గెలిచిన తర్వాత వారి ప్రయోజనాల కోసం ప్రజా ధనాన్ని దోచుకునే పదవులు వారి కి ఇవ్వడం కంటే, పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన సంప్రదాయం మంచిదేనని వారు కౌంటర్స్ ఇస్తున్నారు.
ఏదేమైనా జనసేన విరాళాల సేకరణ కేంద్రంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్, కౌంటర్స్ సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నాయి.