హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ లో నివాసం ఉంటునప్పటికీ తెలంగాణాకు సంబందించిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఏవిధంగా ఓటు వేస్తారు? అని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఆవిధంగా ఓటు వేయకూడదు కనుక ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఆంధ్రాలో ఎమెల్యేగా ఉన్న వ్యక్తి అయన స్వంత రాష్ట్రంలోనే ఓటు వేసుకోవాలి కానీ పొరుగు రాష్ట్రంలో ఏవిధంగా వేస్తారని ఆయన ప్రశ్నించారు.
పొన్నం వాదన సహేతుకంగానే కనిపిస్తున్నప్పటికీ, బాలకృష్ణకి హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్నప్పుడు ఆయన అక్కడ ఓటు వేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. అందుకే ఎన్నికల సంఘం ఆయనను ఓటు వేయడానికి అనుమతించింది. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి కూడా హైదరాబాద్ లోనే ఓటు హక్కు ఉండి ఉంటే, ఆయన కూడా గ్రేటర్ ఎన్నికలలో తప్పకుండా ఓటు వేసేవారు. ఆయన కుటుంబ సభ్యులు అందరికీ హైదరాబాద్ లోనే ఓటు హక్కు ఉంది కనుక అందరూ అక్కడే ఓటు వేసారు. బాలకృష్ణకి కూడా అదే నియమం వర్తిస్తుంది. ఆయన ఆంధ్రాలో ప్రజాప్రతినిధి కావడం చేత, పొన్నం ప్రభాకర్ కి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనుకోవాల్సి ఉంటుంది.
ఈ సంగతి ఎలా ఉన్నా బాలకృష్ణ, హరికృష్ణ, నారా లోకేష్, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవి వంటి ఆంధ్రా నేతలు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వంటి వారు వచ్చే ఎన్నికలలో ఆంధ్రా నుండి పోటీ చేయాలనుకొంటే తప్పనిసరిగా తమ ఓటు హక్కుని ఆంధ్రాలోకి మార్పించుకోవలసి ఉంటుంది. లేకుంటే ఎన్నికలలో పోటీ చేయలేరు.